logo

హైదరాబాద్ వార్తలు

Short News

బేగంబజార్‌, న్యూస్‌టుడే: గౌలిగూడ శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని బుధవారం రాత్రి పది గంటల తర్వాత రామాలయం వద్ద రాజకీయ ప్రసంగం చేయడం, బాణసంచా కాల్చడాన్ని ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పేర్కొంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అఫ్జల్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తుల మధ్య ప్రసంగం చేస్తూ ట్రాఫిక్‌ సమస్యకు కారణమయ్యారని, ఇతరత్రా ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తూర్పు మండలం డీసీపీ గిరిధర్‌ రావు గురువారం ‘ఈనాడు’తో తెలిపారు.

ఈనాడు, హైదరాబాద్‌: హనుమాన్‌ జయంతి రోజు హనుమాన్‌ విజయ యాత్ర ర్యాలీకి నిర్దిష్టమైన షరతులతో అనుమతి మంజూరు చేయాలని పోలీసులకు గురువారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 100 బైక్‌లతో ఉదయం 10 గంటలకు మొదలుపెట్టి 12 గంటలకు ముగించేలా చూడాలంది. షరతులను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చంటూ అనుమతి మంజూరుచేసింది. హనుమాన్‌ విజయ యాత్ర ర్యాలీకి అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర బజరంగ్‌ సేన అధ్యక్షుడు ఎన్‌.ఆర్‌.లక్ష్మణరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈనెల 23న ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు యాత్ర సాగే తీరును వివరించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులను వివరిస్తూ, వాటితో ర్యాలీకి అనుమతించాలని పోలీసులను ఆదేశిస్తూ ఉత్వర్వులు జారీచేశారు.

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ఈసీఐఎల్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఏఎస్‌రావు జీవితంపై రూపొందించిన డాక్యూ డ్రామా(లఘుచిత్రం)ను ఈ నెల 30న ఏఎస్‌రావునగర్‌లోని హోమిజే బాబా సామాజిక భవనంలో ప్రదర్శించనున్నట్లు ఏఎస్‌రావు విజ్ఞాన వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.యాదగిరిరావు, పీబీచారిలు తెలిపారు. గురువారం సుందరయ్య కళానిలయంలో.. లఘుచిత్రం ప్రోమో విడుదల చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ కార్యదర్శి ఎస్‌.వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫిల్మ్‌నగర్‌, న్యూస్‌టుడే: చేవెళ్ల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఆయన కార్యాలయంలో గురువారం రాజేంద్రనగర్‌ నియోజకవర్గ తెలంగాణ జాగృతి నాయకుడు కొండా పరమేశ్‌ గౌడ్‌ తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించిన విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను గతంలో చేసిన అభివృద్ధి పనులే విజయానికి దోహదపడుతాయన్నారు. నాయకులు నారాగూడెం మల్లారెడ్డి, తోకల శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్‌, కొండా ప్రవీణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

యాలాల, న్యూస్‌టుడే: శ్రీరామ నవమిని పురస్కరించుకొని యాలాల మండలంలోని జుంటిపల్లి శ్రీసీతారామ చంద్ర స్వామి జాతర మూడోరోజు గురువారం వైభవంగా సాగింది. మధ్యాహ్నం 3గంటలకు వసంతోత్సవం, పెరుగుబసంతం, శేషవాహన సేవలను ఆలయ ఛైర్మన్‌ హన్మంతరావు ఆధ్వర్యంలో భక్తులు ఘనంగా నిర్వహించారు. దేవాలయ ఆవరణలో ఉన్న చెట్టుపైకి ఎక్కిన అర్చకుడు బిచ్చయ్య కుండ నుంచి పెరుగును కిందకు విసిరేశారు.  అది దొరికిన వారు అదృష్టంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారికూడా పెరుగును పొందిన వారు సంతోషంతో సందడి చేశారు. అనంతరం శేషవాహనంపై స్వామి వారిని ఊరేగింపుగా ఉద్దండరావు చెరువులోకి తీసుకెళ్లి వాదిరాజ్‌ స్నాన ఘట్టం ఆచరింపజేశారు. కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య శాశ్వత ఛైర్మన్‌లు పార్థసారథి, రవీందర్‌రావు, నాగేశ్వర్‌రావు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.