Amrapali Developers: ₹230 కోట్ల బ్యాంకు మోసం..ఆమ్రపాలి డెవలపర్స్‌పై సీబీఐ కేసు!

ఆమ్రపాలి లీజర్‌ వ్యాలీ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని డైరెక్టర్‌ అనిల్‌ శర్మ సహా మరికొంత మందిపై సీబీఐ ఎఫ్‌ఆర్‌ఆర్‌ నమోదు చేసింది....

Published : 20 May 2022 16:21 IST

దిల్లీ: ఆమ్రపాలి లీజర్‌ వ్యాలీ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని డైరెక్టర్‌ అనిల్‌ శర్మ సహా మరికొంత మందిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఆంధ్రా బ్యాంకుకు సంబంధించి రూ.230 కోట్లు మోసం చేశారని పేర్కొంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడా పరిధిలోని 1.06 లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో భవంతుల నిర్మాణం కోసం ఆమ్రపాలి డెవలపర్స్‌కు ఈ రెండు బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పించాయి. కంపెనీ సక్రమంగా  చెల్లింపులు చేయకపోవడంతో మార్చి 31, 2017న కంపెనీ ఖాతాని బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయి. దీని వల్ల ఇరు బ్యాంకులకు రూ.230.91 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపాయి. 

మరోవైపు ఈ ప్రాంతంలో ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని ఆమ్రపాలి గ్రూప్‌ తమని మోసం చేసిందని పలువురు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కంపెనీ కార్యకలాపాలపై ఫొరెన్సిక్‌ తనిఖీ నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫలితంగా రూ.5,619 కోట్ల నిధులను కంపెనీ వివిధ అనుబంధ సంస్థల్లోకి దారి మళ్లించిందని దర్యాప్తు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డట్లు ఫోరెన్సిక్‌ నివేదిక అభిప్రాయపడింది. అనిల్‌ శర్మతో పాటు మరికొంత మంది డైరెక్టర్లు, సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులను కూడా ఈ కేసులో నిందితులిగా సీబీఐ చేర్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని