బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!

లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫండింగ్‌ సంస్థ ‘జూపిటర్ ఫండ్ మేనేజ్‌మెంట్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆండ్రూ ఫార్మికా హఠాత్తుగా రాజీనామా...

Updated : 30 Jun 2022 16:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫండింగ్‌ సంస్థ ‘జూపిటర్ ఫండ్ మేనేజ్‌మెంట్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆండ్రూ ఫార్మికా హఠాత్తుగా రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్టోబర్ 1న తన పదవి నుంచి ఆండ్రూ ఫార్మికా వైదొలగనున్నట్లు సంస్థ ప్రకటనను ఉటంకిస్తూ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ ఈ విషయాన్ని వెల్లడించింది. 68 బిలియన్‌ డాలర్ల (రూ.5 లక్షల కోట్లు) సంపద కలిగిన జుపిటర్‌ సంస్థ బాధ్యతలను 2019లో చేపట్టిన ఆండ్రూ ఉన్నట్లుండి సంస్థకు రాజీనామా చేశారు.

అయితే వ్యక్తిగత కారణాలతోనే సంస్థ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఆయన మరే ఇతర సంస్థలోనూ చేరడం లేదని, కుటుంబంతో గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. అక్టోబర్‌ 1 తర్వాత స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో ఆండ్రూ గడపనున్నారు. ఇన్నాళ్లూ వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమైన ఫార్మికా ఇక నుంచైనా తనకు జన్మనిచ్చిన వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తన ఉద్యోగ జీవితానికి స్వస్తి చెబుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే ‘బీచ్‌లో కూర్చొని ఏమీ చేయకుండా కాలక్షేపం చేయాలనుకుంటున్నా. ఆ క్షణంలో మరేమీ ఆలోచించను’ అని ఆ ఇంటర్వ్యూలో ఆండ్రూ తెలిపారు.

ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో 27 సంవత్సరాల అపార అనుభవం ఉన్న ఆండ్రూ ఫార్మికా వివిధ సంస్థల్లో విలువైన సేవలందించారు. అసెట్ మేనేజర్, ఈక్విటీ ఫండ్ మేనేజర్, ఈక్విటీల హెడ్‌తోపాటు పలు రకాల బాధ్యతలను నిర్వహించారు. ఆండ్రూ ఫార్మికా మూడు దశాబ్దాలుగా ఇంగ్లాండ్‌లోనే ఉన్నారు. రాజీనామా అనంతరం ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని