ద్రవ్యోల్బణం ధాటికి విలవిల

ద్రవ్యోల్బణ భయాలతో కుప్పకూలిన మార్కెట్లు మదుపర్లకు నష్టకన్నీరు తెప్పించాయి. అధిక ద్రవ్యోల్బణానికి తోడు నిరుద్యోగం ప్రబలి, గిరాకీ కొరవడుతుందనే ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు చిగురుటాకులా

Published : 20 May 2022 02:51 IST

 కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

 తాజా రికార్డు కనిష్ఠానికి రూపాయి

 రూ.6.71 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి 

ద్రవ్యోల్బణ భయాలతో కుప్పకూలిన మార్కెట్లు మదుపర్లకు నష్టకన్నీరు తెప్పించాయి. అధిక ద్రవ్యోల్బణానికి తోడు నిరుద్యోగం ప్రబలి, గిరాకీ కొరవడుతుందనే ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు చిగురుటాకులా వణికాయి. ఆ ప్రభావం మన సూచీలపైనా పడి, రూ.6.71 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు కోల్పోయి తాజా కనిష్ఠమైన 77.65 వద్ద ముగిసింది. 

* మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల  మార్కెట్‌ విలువ రూ.6.71 లక్షల కోట్లు తగ్గి రూ.249.06 లక్షల కోట్లకు చేరింది. 

* బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయం 53,070.30 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ నీరసంగా ప్రారంభమైంది. అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో ఇంట్రాడేలో 1540 పాయింట్లు కుదేలైన సెన్సెక్స్‌.. 52,669.51 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1416.30 పాయింట్ల నష్టంతో 52,792.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 430.90 పాయింట్లు క్షీణించి 15,809.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,775.20 వద్ద కనిష్ఠాన్ని తాకింది. రెండు నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీలకు ఇదే అతిపెద్ద ఒక రోజు నష్టం.

* త్రైమాసిక లాభం 11% పెరగడంతో ఐటీసీ షేరు  3.43% లాభంతో రూ.275.65 వద్ద ముగిసింది. 

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 కుదేలయ్యాయి. విప్రో 6.21%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 6.01%, టెక్‌ మహీంద్రా 5.49%, ఇన్ఫోసిస్‌ 5.46%, టీసీఎస్‌ 5.17%, టాటా స్టీల్‌ 4.86%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 4.04%, కోటక్‌ బ్యాంక్‌ 3.45%, ఎం అండ్‌ ఎం 3.30%, భారతీ ఎయిర్‌టెల్‌ 3.24% చొప్పున డీలాపడ్డాయి. ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్, పవర్‌గ్రిడ్‌ మాత్రం 3 శాతం వరకు పెరిగాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. 

* ఈ పరిస్థితుల్లో పసిడిపైకి పెట్టుబడులు మళ్లుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర, భారతీయ కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30 గంటల సమయానికి 1840 డాలర్ల వద్ద ఉంది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,350కి, వెండి కిలో రూ.63,400కు చేరాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని