మిస్త్రీపై టాటాల నిర్ణయం సరైందే

టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ స్థానం నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగిస్తూ టాటా గ్రూప్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2021లో ఇచ్చిన తీర్పుపై, షాపూర్జీ పల్లోంజీ(ఎస్‌పీ) గ్రూప్‌ దాఖలు చేసిన రివ్యూ

Published : 20 May 2022 02:51 IST

రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ స్థానం నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగిస్తూ టాటా గ్రూప్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2021లో ఇచ్చిన తీర్పుపై, షాపూర్జీ పల్లోంజీ(ఎస్‌పీ) గ్రూప్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం కొట్టేసింది. గతేడాది జారీ చేసిన ఆదేశాల్లో సైరస్‌ మిస్త్రీపై చేసిన ఒక వ్యాఖ్యను తొలగించడానికి కోర్టు అంగీకరించింది. ధర్మాసనానికి రాసిన దరఖాస్తులోని కొన్ని పేరాలను ఉపసంహరించుకోవడానికి సిద్ధమని ఎస్‌పీ గ్రూప్‌ తరఫు న్యాయవాది తెలిపిన అనంతరం, అత్యున్నత న్యాయస్థానం కూడా వ్యాఖ్యల తొలగింపునకు ఆమోదం తెలిపింది. ‘రివ్యూ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేం. కొట్టివేస్తున్నామ’ని  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎస్‌. బొపన్న, జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ధర్మాసనం చికాకు: ‘ఒక పత్రికా ప్రకటన కంటే అధ్వానంగా తీర్పు ఉంది’ అంటూ ఎస్‌పీ గ్రూప్‌ తన పిటిషన్‌లో పేర్కొనడంపై వాదనల సందర్భంగా ధర్మాసనం చికాకు వ్యక్తం చేసింది. ‘అది సరిగా లేదు. ముందు ఆ పేరాలను ఉపసంహరించండి’ అని సీజేఐ జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. ధర్మాసనాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని మిస్త్రీ తరఫు న్యాయవాది సోమశేఖరన్‌ సుందరమ్‌ వివరించారు.

ఇదీ జరిగింది:  టాటా సన్స్‌ ఛైర్మన్‌గా 2012లో మిస్త్రీ నియమితులయ్యారు.  నాలుగేళ్ల తర్వాత ఆయనకు సంస్థ ఉద్వాసన పలకడంతో వివాదం తలెత్తింది. టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ జారీ చేసిన ఆదేశాలను 2021 మార్చి 26న సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. 

తీర్పును స్వాగతించిన రతన్‌ టాటా: ఎస్‌పీ గ్రూప్‌ రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేయడంపై టాటా సన్స్‌తో పాటు రతన్‌ టాటా  స్వాగతించారు. ‘తీర్పుపై మేం మా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మన న్యాయ వ్యవస్థ విలువలను ఇది పునరుద్ఘాటించింది’ అని టాటా సన్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని