మారుతీ రూ.18,000 కోట్ల పెట్టుబడులు

హరియాణా రాష్ట్రంలోని సోనిపట్‌ జిల్లాలో మారుతీ సుజుకీ కొత్తగా మరో తయారీ ప్లాంటును రూ.18,000 కోట్లతో నెలకొల్పబోతోంది. ఆ రాష్ట్రంలో సంస్థకు ఇది మూడో ప్లాంట్‌. ఇందులో వచ్చే ...

Published : 20 May 2022 02:49 IST

ఏడాదికి 10 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యం 

గురుగ్రామ్‌: హరియాణా రాష్ట్రంలోని సోనిపట్‌ జిల్లాలో మారుతీ సుజుకీ కొత్తగా మరో తయారీ ప్లాంటును రూ.18,000 కోట్లతో నెలకొల్పబోతోంది. ఆ రాష్ట్రంలో సంస్థకు ఇది మూడో ప్లాంట్‌. ఇందులో వచ్చే 8 ఏళ్లలో ఏడాదికి 10 లక్షల కార్లు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. 800 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌లో తొలిదశలో రూ.11,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా వార్షికంగా 2.5 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తామని సంస్థ పేర్కొంది. ఈ ప్లాంట్‌ నుంచి 2025లో తొలి బ్యాచ్‌ వాహనాలు విపణిలోకి వస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ మాట్లాడుతూ ‘సోనిపట్‌ ప్లాంటులో 10 లక్షల కార్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యానికి చేరితే, దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో గిరాకీని అందుకోవచ్చు. అప్పుడు దేశంలోనే అతి పెద్ద ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్‌గా ఇది మారుతుంద’ని ఆయన వివరించారు. 800 ఎకరాల భూ కేటాయింపునకు గాను రూ.2,131 కోట్ల చెక్కును హరియాణా రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌కు (హెచ్‌ఎస్‌ఐఐడీసీ) మారుతీ సంస్థ అందజేసింది. సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియాకు కూడా మరో 100 ఎకరాలను కేటాయించడంతో ఆ సంస్థ రూ.266 కోట్ల చెక్కును అందించింది. రూ.1,466 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుజుకీ మోటార్‌ సైకిల్‌ తెలిపింది. ఈ ప్లాంట్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 13,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు, వాణిజ్యం) విజయేంద్ర కుమార్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని