Prudent Corporate Listing: ప్రుడెంట్‌ కార్పొరేట్‌ లిస్టింగ్‌ ఆరంభంలో భళా.. తర్వాత డీలా!

ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ షేర్లు శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.630తో పోలిస్తే బీఎస్‌ఈలో 4.76 శాతం లాభంతో రూ.660 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 3.17 శాతం ప్రీమియంతో రూ.650 వద్ద లిస్టయ్యాయి....

Published : 20 May 2022 12:41 IST

దిల్లీ: ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ షేర్లు శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.630తో పోలిస్తే బీఎస్‌ఈలో 4.76 శాతం లాభంతో రూ.660 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 3.17 శాతం ప్రీమియంతో రూ.650 వద్ద లిస్టయ్యాయి. అయితే, కాసేపటికే షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. దీంతో నష్టాల్లోకి జారుకున్నాయి. బహుశా లిస్టింగ్‌ గెయిన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న చిరు మదుపర్లు లిస్టింగ్‌ ధర వద్దే విక్రయించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదయం 11:31 గంటల సమయంలో కంపెనీ షేర్లు 6.85 శాతం నష్టంతో రూ.586 వద్ద చలిస్తున్నాయి. ఈ కంపెనీ షేర్లకు ఐపీఓలో 1.22 రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే.

ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ రూ.538.61 కోట్ల సమీకరణే లక్ష్యంగా పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ధరల శ్రేణి రూ.595-630గా నిర్ణయించింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీని 2003లో స్థాపించారు. మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Fund) ఉత్పత్తులు, జీవిత, సాధారణ బీమా, స్టాక్‌ బ్రోకింగ్‌ సేవలు వంటి రంగాల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. ఫండ్‌బజార్‌, ప్రుడెంట్‌ కనెక్ట్‌, పాలసీవరల్డ్‌, వైజ్‌బాస్కెట్‌, క్రెడిట్‌బాస్కెట్‌ వేదికల ద్వారా ఈ కంపెనీ పూర్తిగా డిజిటల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పరిష్కారాలను అందజేస్తోంది. డిసెంబరు 31, 2021 నాటికి కంపెనీ రూ.48,411 కోట్ల విలువ చేసే మ్యూచువల్‌ ఫండ్లను నిర్వహిస్తోంది. వీటిలో 92 శాతం ఈక్విటీ ఆధారిత పథకాలకు చెందిన పెట్టుబడులు కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని