Stock Market Update: మార్కెట్లు రయ్‌.. రయ్‌.. భారీ లాభాల్లో సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఎంత భారీగా నష్టపోయాయో.. ఈరోజు అంతే బలంగా పుంజుకున్నాయి...

Updated : 20 May 2022 16:15 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఎంత భారీగా నష్టపోయాయో.. ఈరోజు అంతే బలంగా పుంజుకున్నాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించడంతో నిన్నటి నష్టాలన్నీ పూర్తిగా రికవరీ అయ్యాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల పవనాలు, ఐరోపా మార్కెట్ల శుభారంభం, యూఎస్‌ ఫ్యూచర్స్‌ సైతం లాభాల్లో పయనిస్తుండడం సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపారు. రిలయన్స్‌ వంటి దిగ్గజ కంపెనీలు రాణించడం కూడా సూచీలకు కలిసొచ్చింది.

ఉదయం సెన్సెక్స్‌ 53,513.97 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,381.38 - 53,403.29 మధ్య కదలాడింది. చివరకు 1556.26 పాయింట్ల భారీ లాభంతో 54,208.53 వద్ద ముగిసింది. 16,043.80 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 447.20 పాయింట్లు లాభపడి 16,256.60 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,281.50 - 16,003.85 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.55 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్‌, నెస్లే ఇండియా, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు భారీగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* గత ఏడాది నాలుగో త్రైమాసికంలో జె.కె.సిమెంట్స్‌ ఫలితాలు అంచనాలను మించడంతో కంపెనీ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 16 శాతం వరకు లాభపడ్డాయి.

* డాక్టర్ రెడ్డీస్‌ షేర్లు ఇంట్రాడేలో 8 శాతానికి పైగా లాభపడింది. సెప్టెంబరు 2020 తర్వాత ఇదే అతిపెద్ద ఒకరోజు లాభం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఫలితాలు అంచనాలను అందుకోవడమే ర్యాలీకి కారణం. 

* వెల్‌స్పన్‌ షేర్లు ఈరోజు ట్రేడింగ్‌లో 18 శాతం లాభపడి 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. అమెరికా నుంచి రూ.5000 కోట్లు విలువ చేసే పైపులకు సంబంధించిన ఆర్డరు దక్కడమే ఇందుకు కారణం. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద ఆర్డర్‌ కావడం విశేషం.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఈరోజు ఐదు శాతానికి పైగా లాభపడ్డాయి. ఇది గత పదివారాల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభం కావడం విశేషం.

* ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ షేర్లు ఈరోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో తొలిసారి నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.630తో పోలిస్తే ఉదయం 5 శాతం లాభంతో ప్రారంభమైన కంపెనీ షేర్లు కాసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. చివరకు 10 శాతానికి పైగా నష్టపోయి రూ.561 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని