SCSS: సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్‌ను ఎవ‌రు తెర‌వ‌చ్చు?

సీనియ‌ర్ సిటిజ‌న్లు వారి జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఉమ్మ‌డి ఖాతా తెర‌వ‌చ్చు.

Published : 20 May 2022 16:34 IST


సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌(ఎస్‌సీఎస్ఎస్‌) అనేది ప్ర‌భుత్వ హామీతో  ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్న ప‌థ‌కం. పెద్ద‌లు ఈ ప‌థ‌కంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో డ‌బ్బు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. వ్య‌క్తిగ‌తంగా గానీ, ఉమ్మ‌డిగా గానీ ఖాత‌ను తెరిచే వీలుంది. ఖాతా తెరిచిన‌ప్పుడు క‌నీసం రూ. 1000 నుంచి గ‌రిష్టంగా రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఒకేసారి డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 7.4 శాతం. ఈ ప‌థ‌కంలో వ‌డ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్ర‌తీ ఆర్థిక సంవ‌త్స‌రం.. ఏప్రిల్‌, జూలై, అక్టోబ‌రు, జ‌న‌వ‌రి నెల‌ల్లో మొద‌టి తేదిన వ‌డ్డీ ఖాతాల‌లో జ‌మ‌వుతుంది.  అంతేకాకుండా ఈ ప‌థకంలో పెట్టుబ‌డులు పెట్టిన‌వారు పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌తో క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. 

ఈ ప‌థ‌కంలో ఎవ‌రు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు?

60 ఏళ్లు నిండిన పెద్ద‌లు..
భార‌తీయ‌ నివాసితులైన సీనియ‌ర్ సిటిజ‌న్లు( 60 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారు) ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. 

వీఆర్ఎస్ కింద రిటైరైన‌వారు..
55 నుంచి 60 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు వారు కూడా ఇందులో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అయితే వారు స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ ప‌థ‌కం (వాలెంట‌రీ రిటైర్‌మెంట్ స్కీమ్- వీఆర్ఎస్‌) కింద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసివుండాలి.  ఒక‌వేళ వీఆర్ఎస్ స్కీమ్ కింద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి ఖాతా తెరుస్తుంటే.. ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను పొందిన ఒక నెల లోపు ఖాతాను తెర‌వాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో పెట్టుబ‌డి పెట్టిన మొత్తం ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను మించ‌కూడ‌దు. 

ఇటువంటి వారు ఎస్‌సీఎస్ఎస్ ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు వాలంట‌రీ రిటైర్‌మెంట్‌కు సంబంధించిన వివ‌రాల‌తో కూడిన స‌ర్టిఫికేట్, రిటైర్‌మెంట్ బెనిఫిట్ పొందిన తేది వివరాల ఫ్రూఫ్‌ల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 

ర‌క్ష‌ణ ద‌శంలో ప‌నిచేసిన వారు..
దేశ ర‌క్ష‌ణాద‌శంలో ప‌నిచేసి ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన వారు పైన తెలిపిన వ‌య‌సు ప‌రిమితితో సంబంధం లేకుండా ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే వారికి నిర్ధిష్ట నిబంధ‌న‌లు, ష‌ర‌తులు వర్తిస్తాయి. 

ఉమ్మ‌డి ఖాతా..
జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఉమ్మ‌డి ఖాతా తెర‌వ‌చ్చు. అయితే ఉమ్మడి ఖాతా విషయంలో, మొదటి దరఖాస్తుదారు వయస్సు అర్హ‌త‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. రెండవ దరఖాస్తుదారుని వయస్సుకు పరిమితి లేదు. 

ఎవ‌రికి అర్హ‌త లేదు..
హిందూ అవిభాజ్య కుటుంబాల వారు(హెచ్‌యూఎఫ్‌), ప్ర‌వాస భార‌తీయుల(ఎన్ఆర్ఐ)ను ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అనుమ‌తించ‌రు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని