Emergency Landing: విమానం మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండ్.. ప్రయాణికుడి మృతి

కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి దిల్లీకి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే విమానాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది...

Published : 23 Oct 2021 01:11 IST

ఇండోర్‌: కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి దిల్లీకి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే విమానాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విస్టారా విమానం యూకే- 818 గురువారం సాయంత్రం బెంగళూరు నుంచి దిల్లీకి బయల్దేరింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న దిల్లీకి చెందిన మనోజ్ కుమార్ అగర్వాల్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. కొద్ది సేపటికే మూర్చపోవడంతో.. ఈ మేరకు సమాచారం అందుకున్న పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించారు.

రాత్రి 9.30 గంటల సమయంలో ఇండోర్‌లోని దేవి అహల్యాబాయి హోల్కర్‌ విమానాశ్రయంలో మెడికల్ ఎమర్జెన్సీ కింద ల్యాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ ప్రమోద్‌ కుమార్ శర్మ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలుస్తోందని ఆ ఆసుపత్రి డైరెక్టర్ డా.సునీల్ బాంతియా చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఏరోడ్రోమ్ పోలీస్‌స్టేషన్ అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని