Telangana News: పుట్టిన రోజే చివరి రోజు

ఉద్యోగానికి వెళ్తూ పుట్టిన రోజు నాడే రైలు ప్రమాదంలో ఓ వివాహిత దుర్మరణం చెందిన ఘటన ఖైరతాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే పోలీసుల కథనం ప్రకారం..మహారాష్ట్రలోని వీటీసీ షోలాపూర్‌

Updated : 19 May 2022 13:51 IST

ఎంఎంటీఎస్‌ ఢీకొని మహిళ మృతి

ఖైరతాబాద్‌, నాంపల్లి - న్యూస్‌టుడే:  ఉద్యోగానికి వెళ్తూ పుట్టిన రోజు నాడే రైలు ప్రమాదంలో ఓ వివాహిత దుర్మరణం చెందిన ఘటన ఖైరతాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే పోలీసుల కథనం ప్రకారం..మహారాష్ట్రలోని వీటీసీ షోలాపూర్‌ న్యూరంగరాజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రమేష్‌ రచ్చకు భార్య, కుమార్తె లావణ్య(36), ఇద్దరు కుమారులున్నారు. లావణ్యను అదే ప్రాంతానికి చెందిన గణేష్‌కు ఇచ్చి 17 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. భర్త ప్రవర్తన భరించలేక షోలాపూర్‌ కోర్టులో విడాకులకు దాఖలు చేసుకుంది. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. మూడేళ్ల క్రితం తల్లిదండ్రులతో పాటు ఇద్దరు కుమార్తెలను తీసుకుని నగరానికి వలసవచ్చి ఖైరతాబాద్‌లోని తుమ్మలబస్తీలో అద్దెకుంటోంది. తండ్రి రమేష్‌ ఓ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, లావణ్య టెలికాలర్‌గా పని చేస్తోంది.

పులిహోర వండి పెట్టి.. తన జన్మదినం సందర్భంగా బుధవారం లావణ్య ఉదయం ఇంట్లో అందరికీ ఇష్టమైన పులిహోర చేసి వడ్డించి, తానూ టిఫిన్‌ కట్టుకుని ఉద్యోగానికని బయలుదేరింది. ఖైరతాబాద్‌ రైల్వే పట్టాలు దాటే సమయంలో అటువైపు పట్టాలపై ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తోంది. ఆ రైలు వెళ్లిన తర్వాత పట్టాలు దాటొచ్చని పట్టాలకు ఇటువైపున పక్కనే నిల్చుంది. అదే సమయంలో ఇటువైపున ట్రాక్‌పై ఎంఎంటీఎస్‌ రైలు దూసుకొచ్చింది. లావణ్య గమనించలేదు. ఇంతలోనే రైలు ఆమె తలను ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అంబులెన్స్‌కు సమాచారం అందించగా వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించే సరికే ఆమె మృతి చెందిందని ధ్రువీకరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపేందుకు ఫోన్‌  రావడంతో గుర్తింపు..
మృతురాలి వివరాలు మొదట తెలియపోవడంతో గుర్తుతెలియని మహిళ మృతిగా రైల్వే పోలీసులు భావించారు. సాయంత్రానికి ఆమె స్నేహితుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఫోన్‌ చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని నాంపల్లి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని