హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి

కుటుంబ కలహాల నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదంలో తండ్రితో పాటు కుటుంబసభ్యులు దాడి చేయడంతో కొడుకు హత్యకు గురైన సంఘటన పర్చూరు మండలం ఏదుబాడులో చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు చెరిపేసి ఆత్మహత్యగా

Updated : 20 May 2022 05:16 IST

కొడుకును హతమార్చిన తండ్రి, కుటుంబసభ్యులు
కోడలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు


ఏసురత్నం (పాత చిత్రం)

పర్చూరు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదంలో తండ్రితో పాటు కుటుంబసభ్యులు దాడి చేయడంతో కొడుకు హత్యకు గురైన సంఘటన పర్చూరు మండలం ఏదుబాడులో చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు చెరిపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసుల రంగం ప్రవేశంతో హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సై లక్ష్మీభవాని తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొనుగుపాటి ఏసురత్నం(28) అదే గ్రామానికి చెందిన నీలిమ ప్రియాంకను 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో ఏసురత్నం కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా కొంతకాలం తర్వాత కలిసే ఉంటున్నారు. నీలిమ, ఏసురత్నం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నారు. మద్యానికి అలవాటైన ఏసురత్నం భార్య, కుటుంబ సభ్యులను తరచూ వేధిస్తుండేవాడు. ఈనెల 15న మద్యం సేవించి గొడవపడటంతో భార్య ఏదుబాడు వచ్చింది. 17న తల్లితో కలిసి మేదరమెట్లలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లింది. భార్య కోసం 18వ తేదీ మధ్యాహ్నం స్వగ్రామానికి వచ్చిన ఏసురత్నం గ్రామంలో లేకపోవడంతో తండ్రి వద్దకు వెళ్లాడు. భార్యను తీసుకురావడానికి తండ్రిని రమ్మని కోరాడు. మద్యం సేవించి గొడవ పడుతుంటే ఎలా వస్తారని అని తండ్రి అనడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో కుమారుడిపై తండ్రి బాపయ్యతో పాటు కుటుంబసభ్యులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తల, ఇతర శరీర భాగాలలో బలమైన గాయాలయ్యాయి. కొద్దిసేపటికే ఏసురత్నం మృతి చెందాడు. హత్య చేసినట్లు అనుమానం వస్తుందనే భయంతో శరీరంపైనా, గదిలోనూ కనిపించకుండా రక్తపు మరకలు తుడిచేశారు. మేదరమెట్లలో ఉంటున్న మృతుని భార్య నీలిమా ప్రియాంకకు బుధవారం సాయంత్రం ఫోన్‌ చేసి పురుగుమందు తాగి చనిపోయినట్లు ఆమె మామ సమాచారం అందించారు. బంధువులతో కలిసి గ్రామానికి వచ్చిన నీలిమ భర్త శరీరంపై ఉన్న గాయాలు చూసి ఆందోళనకు గురై నిలదీసింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో పర్చూరు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎస్సై లక్ష్మీభవాని వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గురువారం ఉదయం ఇంకొల్లు సీఐ సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని తల్లిదండ్రులతో పాటు అతని సోదరి, బావపై హత్య, సాక్ష్యాలు లేకుండా చేయడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై లక్ష్మీభవాని 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని