Crime news: క్లోరిన్‌ వాయువు లీక్‌.. ఒకరి మృతి; 13 మందికి అత్యవసర చికిత్స!

తమిళనాడులోని ఈరోడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తోడ్‌ ప్రాంతంలోని బ్లీచింగ్‌ పౌడర్‌ తయారీ కేంద్రంలో ద్రవరూప క్లోరిన్‌ లీకైంది. దీంతో ఆ కేంద్రంలోని 14 మంది స్పృహకోల్పోయారు...........

Published : 12 Dec 2021 01:09 IST

ఈరోడ్‌: తమిళనాడులోని ఈరోడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తోడ్‌ ప్రాంతంలోని బ్లీచింగ్‌ పౌడర్‌ తయారీ కేంద్రంలో ద్రవరూప క్లోరిన్‌ లీకైంది. దీంతో ఆ కేంద్రంలోని 14 మంది స్పృహకోల్పోయారు. ఈ ప్రమాదంలో కర్మాగారం యజమాని మృతి చెందగా.. 13మందిని ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిత్తోడ్‌ సమీపంలో బ్లీచింగ్‌ తయారు చేసే కర్మాగారంలో శనివారం రోజువారీ చర్యల్లో భాగంగా కార్మికులు పనుల్లో ఉండగా హఠాత్తుగా ఒక్కసారిగా ద్రవరూప క్లోరిన్‌ లీకైంది. దీంతో కర్మాగారం యజమాని దామోదరన్‌ సహా 14మంది కార్మికులు ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. క్లోరిన్‌ వాయువు విషపూరితాల కారణంగా స్పృహ తప్పిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. 

కర్మాగారం నుంచి బయటకు వచ్చి స్పృహతప్పి పడిపోయిన వారిని చూసిన సమీపంలోని స్థానికులు ఈరోడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊపిరాడకపోవడంతో కర్మాగార యజమాని దామోదరన్‌ (47) మృతి చెందారు.  సమీపంలోని భవానీ, చిత్తోడ్‌, ఈరోడ్‌ అగ్నిమాపక సిబ్బంది కవచ దుస్తులు ధరించి కర్మాగారంలోకి వెళ్లి క్లోరిన్‌ లీకేజీని అదుపు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా సున్నం కలిపిన నీటిని కర్మాగారం వద్ద వెదజల్లారు. సమీపంలోని వర్క్‌షాప్‌ కార్మికులను కర్మాగారం నుంచి దూరంగా వెళ్లాలని సూచించారు. మృతుడు శ్రీధర్‌ కెమికల్స్‌ పేరుతో బ్లీచింగ్‌ పౌడర్‌ తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు. గ్యాస్‌ లీకేజీ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ కృష్ణనున్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని