Andhra News: నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదేమో?: ఏబీ వెంకటేశ్వరరావు

తనను కలవడం ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మకు ఇష్టం లేదేమోనని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అన్నారు.

Updated : 20 May 2022 06:21 IST

విజయవాడ: తనను కలవడం ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మకు ఇష్టం లేదేమోనని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అన్నారు. తన సస్పెన్షన్‌ చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చిందని చెప్పారు. ఈ విషయంలో చట్టప్రకారమే తాను ముందుకెళ్లానన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడారు.

ఏబీవీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి వెయిటింగ్‌ పీరియడ్‌గా పరిగణిస్తామని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏబీవీ జీఏడీలో రిపోర్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘జీఏడీలో రిపోర్ట్ చేయడం వరకే నా పని. రెండేళ్ల సస్పెన్షన్‌ గురించి నేను మాట్లాడటం లేదు. అయితే ప్రభుత్వం జారీ చేసి ఉత్తర్వును సరిచేయాలని కోరేందుకు సీఎస్‌ సమీర్‌ శర్మను కలవాలని అనుకున్నా. కానీ వినతిపత్రాన్ని వ్యక్తిగత సహాయకుడు (పీఏ)కు ఇచ్చి వెళ్లాలని సూచించారు. నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదేమో? నా వినతిపత్రం చదివితే కదా దానిలో ఏముందో తెలిసేది! పోస్టింగ్‌ ఇవ్వలేదు.. జీతం ఇచ్చేందుకు ఇబ్బందేంటి? కొంతమందిని ఏళ్ల తరబడి వీఆర్‌లో ఉంచి జీతాలు ఇవ్వడం లేదు. తప్పు చేస్తే శిక్షించాలి లేదా సమయానికి జీతం ఇవ్వాలి. సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను ఏదైనా అనే ముందు ఎస్పీలు, ఇతర అధికారులను అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి’’ అని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని