Telangana News: తెలంగాణలో పోలీసు నియామకాల దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Updated : 20 May 2022 21:51 IST

హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా దరఖాస్తు గడువును సైతం పొడిగించింది. నోటిఫికేషన్‌ ఆధారంగా ఈ నెల 2వ తేదీన ప్రారంభమమైన దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఈ రోజు రాత్రి 10గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా, వయోపరిమితి పెంచడంతో మరికొంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నందున దరఖాస్తు గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది.

కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల విలువైన కాలాన్ని తెలంగాణ యువత కోల్పోయిన నేపథ్యంలో వయోపరిమితిని పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌, డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. నోటిఫికేషన్లు జారీ చేసిన సమయంలోనే యూనిఫాం పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో మరికొంత మంది అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించినట్లు అయింది. కాగా, దరఖాస్తు ప్రక్రియ గడువును ఎట్టిపరిస్థితుల్లో పొడిగించేది లేదని పోలీసు నియామక మండలి గతంలోనే తేల్చి చెప్పింది. గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు మరికొంత సమయాన్ని ఇవ్వాలని నిరుద్యోగుల నుంచి వినతులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు గడువును పొడిగించింది.

రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఆబ్కారీ, రవాణా, అటవీ, ప్రత్యేక భద్రత దళం తదితర యూనిఫామ్‌ సర్వీసు ఉద్యోగాలకు వయోపరిమితిని మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఏప్రిల్ 13న‌ ఉత్తర్వులు (జీవో నం.48) జారీచేసింది. ప్రత్యక్ష నియామకాలకు రెండేళ్ల పాటు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. తాజాగా మరో రెండేళ్లు వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌, డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 22గా ఉంది. ఇకపై ఈ పరిమితి 27 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రస్తుతం 27 సంవత్సరాలుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి 32కి పెరుగుతుంది.

 ఎస్సై ఉద్యోగాలకు కనిష్ఠ వయసు 21 కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 25 ఏళ్లుగా ఉంది. ఇకపై ఇది 30 ఏళ్లకు చేరుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం 30 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితి ఉండగా.. ఇకపై 35 అవుతుంది.

 డీఎస్పీ పోస్టులకు కనిష్ఠ వయోపరిమితి 21 కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 28గా ఉంది. ఇకపై అది 33 అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని