Floods: వరద బీభత్సం.. 500 కుటుంబాలు రైల్వే ట్రాక్‌పైనే..!

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి

Updated : 21 May 2022 15:23 IST

బిహార్‌లో వరద సంబంధిత ఘటనల్లో 27 మంది మృతి

గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. 29 జిల్లాల్లో దాదాపు 8లక్షల మందికి పైగా వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. జమునాముఖ్‌ జిల్లాలోని చాంగ్జురై, పటియా పాథర్‌ గ్రామాలు పూర్తిగా నీటమునగడంతో 500లకు పైగా కుటుంబాలు రైల్వే ట్రాక్‌లపై రోజులు గడుపుతున్నాయి.

ఈ రెండు గ్రామాలను వరదలు ముంచెత్తాయి. రైల్వే ట్రాక్‌ కాస్త ఎత్తులో ఉండటంతో అది వరద నీటిలో మునిగిపోలేదు. దీంతో ఈ గ్రామాలకు చెందిన కుటుంబాలు సర్వం కోల్పోయి ట్రాక్‌పై టార్పలిన్ షీట్లతో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. గత ఐదు రోజులుగా తమ పరిస్థితి ఇలాగే ఉందని, తినడానికి తిండి కూడా దొరకట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మొదటి మూడు రోజులు గుడారాలు కూడా లేవు. ఆ తర్వాత మా దగ్గర ఉన్న డబ్బులతో టార్పలిన్‌ షీట్లు తీసుకొచ్చుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. తాగడానికి నీళ్లు లేవు. రోజుకు ఒక పూటే తింటున్నాం’’ అని బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

అస్సాంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించాయి. జలవిలయంతో కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్డు మార్గాలు కొట్టుకుపోయాయి. అనేక చోట్ల రైల్వే ట్రాక్‌లు కూడా నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  వరద ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), అగ్నిమాపక శాఖ బలగాలతో పాటు స్థానికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

బిహార్‌లోనూ భారీ వర్షాలు..

బిహార్‌ను ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల వృక్షాలు నేలకూలాయి. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వరద సంబంధిత ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వరదల ఘటనలపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

రక్షణ మంత్రి విమానం దారిమళ్లింపు..

అటు దేశరాజధాని దిల్లీలోనూ నిన్న సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో దిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 11 విమనాలను లఖ్‌నవూ, జైపుర్‌కు దారిమళ్లించారు. ఇందులో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రయాణించిన విమానం కూడా ఉంది.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కూడా అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళను తాకనున్నాయి. దీంతో కేరళ రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉంది. కర్ణాటకలోనూ వర్షాలు కురుస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని