VK Singh: 1857 తిరుగుబాటు నాటి చరిత్రను మరుగున పడేశారు: కేంద్రమంత్రి

దేశాన్ని పాలించేందుకు బ్రిటిషర్లు ఎలాగైతే విభజించి పాలించారో.. స్వాతంత్ర్యం తర్వాత కూడా కొంతమంది అదే వ్యూహాన్ని కొనసాగించారని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ పేర్కొన్నారు.

Published : 19 May 2022 02:25 IST

బ్రిటిషర్లు విభజించినట్లే స్వాతంత్ర్యం తర్వాత కొనసాగిందన్న కేంద్రమంత్రి

పుణె: దేశాన్ని పాలించేందుకు బ్రిటిషర్లు ఎలాగైతే విభజించి పాలించారో.. స్వాతంత్ర్యం తర్వాత కూడా కొంతమంది అదే వ్యూహాన్ని కొనసాగించారని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ వ్యాఖ్యానించారు. ఎంఐటీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విద్యార్థులు చరిత్రను చదివి విశ్లేషించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలను ఏకం చేయాల్సిన అవసరం ఉందన్న వీకే సింగ్‌.. సైన్యంలో మాదిరిగా ఐకమత్యంగా ఉండాలన్నారు.

‘మనది సుదీర్ఘమైన చరిత్ర కలిగిన దేశం. 1857 తర్వాత చాలా సమస్యలు ఎదురయ్యాయి. అయితే, 1857 తిరుగుబాటు నాటి ఎన్నో విషయాలు మరుగునపడ్డాయి. మనవాళ్లు చాలా మంది బ్రిటిషర్లతో పోరాడారు. కానీ అలాంటి చరిత్రకు రూపులేకుండా చేశారు. అదంతా మార్చేశారు’ అని ఆర్మీ మాజీ చీఫ్‌ వీకే సింగ్‌ పేర్కొన్నారు. ‘బ్రిటిషర్లు మనల్ని విభజించి పాలించడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా చాలా మంది బ్రిటిషర్ల మనస్తత్వంతో విభజించి పాలించే వ్యూహాన్ని కొనసాగించారు. అందుకే ప్రజల్ని ఏకం చేయాల్సిన అవసరం ఉంది. దేశమే తొలి ప్రాధాన్యం’ అని వీకే సింగ్‌ ఉద్బోధించారు. సైన్యంలో కులం పేరుతో ఎటువంటి వివక్ష ఉండదన్న ఆయన.. సేవే అక్కడ మతమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని