బెంగాల్‌లో మంత్రి కుమార్తెకు షాక్‌.. జీతం తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు ఆర్డర్‌!

ఓ మంత్రి కుమార్తెకు కలకత్తా హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. అక్రమ మార్గంలో ఉద్యోగం పొందారంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పరేశ్‌ చంద్ర అధికారి కుమార్తె అంకిత అధికారి.......

Published : 21 May 2022 01:56 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఓ మంత్రి కుమార్తెకు కలకత్తా హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. అక్రమ మార్గంలో ఉద్యోగం పొందారంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పరేశ్‌ చంద్ర అధికారి కుమార్తె అంకిత అధికారి ఉద్యోగాన్ని న్యాయస్థానం రద్దు చేసింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో ఉద్యోగిగా పనిచేస్తున్న అంకిత నియామకం చెల్లదని, ఆమె తీసుకున్న జీతం మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని జస్టిస్‌ అవిజిత్‌ గంగోపాధ్యాయ్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. 2018 నుంచి ఆమె తీసుకున్న వేతనం మొత్తాన్ని రెండు వాయిదాల్లోనే రిజిస్ట్రార్‌ వద్ద జమ చేయాలని స్పష్టంచేసింది. ఉద్యోగ నియామక పరీక్షలో అధికారి కుమార్తె అంకిత కంటే అధిక మార్కులు సాధించినప్పటికీ తనను పక్కనపెట్టి ఆమెకు ఉద్యోగం ఇచ్చారంటూ ఓ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పైవిధంగా తీర్పు వెలువరించింది.

మరోవైపు, తన కుమార్తె అక్రమ నియామకం ఆరోపణలపై జరుగుతున్న విచారణ కోసం మంత్రి పరేశ్‌ చంద్ర అధికారి ఈరోజు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే, ఈ కేసుకు విచారణకు సీబీఐ ముందు హాజరయ్యేందుకు నిన్ననే ఆఖరి గడువు కాగా.. ఆయన హాజరుకాలేదు. దీంతో సీబీఐ అధికారులు మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అలాగే, మంత్రి పరేశ్‌చంద్ర అధికారితో పాటు ఆయన కుమార్తెపై మోసం, నేరపూరిత కుట్ర అభియోగాలపై ఐపీసీ 420, 120బి సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు