Ola: 15 రోజుల్లో సమాధానం ఇవ్వండి.. ఓలా, ఉబర్‌లకు నోటీసులు

క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలైన ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అన్యాయమైన వాణిజ్య విధానాలను......

Published : 21 May 2022 02:03 IST

దిల్లీ: క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలైన ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అన్యాయమైన వాణిజ్య విధానాలను అవలంబించడం, వినియోగదారుల హక్కుల్ని ఉల్లంఘిస్తుండటంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు శుక్రవారం రెండు సంస్థలకూ నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది. తాము ఇచ్చిన నోటీసులకు 15 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని గడువును నిర్దేశించింది. ‘‘ఓలా, ఉబర్‌ సంస్థలకు మేం నోటీసులు జారీ చేశాం. గత ఏడాది కాలంలో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు సేవల్లో లోపాలు, అన్యాయమైన వాణిజ్య విధానాలకు సంబంధించినవే ఉన్నాయి’’ అని సీసీపీఏ ముఖ్య కమిషనర్‌ నిధి ఖారే వెల్లడించారు.

మరోవైపు, జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ సమాచారం మేరకు గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి 2022 మే 1 వరకు వినియోగదారుల నుంచి ఓలాపై 2482, ఉబర్‌పై 770 ఫిర్యాదులు వచ్చాయి. ఈ మొత్తం ఫిర్యాదుల్లో ఓలాపై 54శాతం, ఉబర్‌పై 64శాతం ఫిర్యాదులు కేవలం సేవల లోపాలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇటీవల క్యాబ్‌ అగ్రిగేటర్స్‌ సంస్థలతో సమావేశమైన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ వినియోగదారుల ఫిర్యాదుల్ని పరిష్కరించే అంశంలో మెరుగుపడకపోతే కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని