VPN Network: నిబంధనలు పాటించండి.. లేదంటే భారత్‌ నుంచి వెళ్లిపోండి

భారత్‌ రూపొందించిన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు నడుచుకోవాల్సిందేనని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఉద్ఘాటించారు.

Published : 20 May 2022 01:46 IST

వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు కేంద్ర ఐటీశాఖ స్పష్టం

దిల్లీ: భారత్‌ రూపొందించిన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు నడుచుకోవాల్సిందేనని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఒకవేళ వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు లేదా ఇతర వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు నూతన మార్గదర్శకాలను పాటించకుంటే దేశం నుంచి నిష్క్రమించడం తప్ప వారికి మరోమార్గం లేదని తేల్చిచెప్పారు. సైబర్‌ ఉల్లంఘనల నమోదుపై ఇటీవల రూపొందించిన మార్గదర్శకాలపై తరచూ అడిగే ప్రశ్నలను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు.

‘భారత్‌లో నిబంధనలు, చట్టాలను పాటించలేమని చెప్పడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. ఇప్పటివరకు లాగ్‌ రికార్డులు లేకుంటే.. వాటిని ఇకనుంచి మొదలుపెట్టండి. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్గదర్శకాలు పాటించలేమని కోరుకునేవారు ఒకవేళ భారత్‌ నుంచి వెళ్లిపోవాలనుకుంటే నిరభ్యంతరంగా నిష్క్రమించవచ్చు’ అని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నిబంధనల్లో ప్రభుత్వం ఎటువంటి మార్పుచేయదని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, వీపీఎన్‌ సంస్థలు, డేటా సెంటర్లు యూజర్‌ డేటాను ఐదేళ్లపాటు భద్రపరచడం తప్పనిసరి చేస్తూ ఇటీవల ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (CERT-In) నిబంధనలు జారీ చేసింది. అంతేకాకుండా సైబర్‌ దాడులకు సంబంధించిన ఘటనలను గుర్తించిన ఆరు గంటల్లోపే వాటి వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. అయితే, వీటిని వ్యతిరేకిస్తోన్న కొన్ని వీపీఎన్‌ కంపెనీలు.. ఈ కొత్త నిబంధనలు సమాచార భద్రతలో లొసుగులకు దారితీస్తాయని వాదిస్తున్నాయి. ఇదే విషయంపై గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఐబీఎం, సీస్కో వంటి టెక్‌ దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్న అమెరికాకు చెందిన ఐటీఐ కూడా మార్గదర్శకాలను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే సైబర్‌ సెక్యూరిటీ నిబంధనలు ఎట్టిపరిస్థితుల్లో మార్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని