పార్టీలో సంస్కరణలు సాకారమవ్వాలి

రాజస్థాన్‌లో ఇటీవల నిర్వహించిన నవసంకల్ప చింతన శిబిరం పార్టీని సంస్కరించి, పునరుజ్జీవింపజేయడంపై దృష్టి పెట్టిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఆశించిన

Published : 19 May 2022 05:30 IST

అధ్యక్ష పీఠమెక్కేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో రాహుల్‌ చెప్పలేదు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ వ్యాఖ్యలు

దిల్లీ: రాజస్థాన్‌లో ఇటీవల నిర్వహించిన నవసంకల్ప చింతన శిబిరం పార్టీని సంస్కరించి, పునరుజ్జీవింపజేయడంపై దృష్టి పెట్టిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఆశించిన ఫలితమిస్తుందా లేదా అన్నది మరికొన్ని నెలల్లో తేలుతుందని అన్నారు. పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్‌ గాంధీయే చేపట్టాలని అత్యధిక మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆశిస్తున్నా.. అందుకు సిద్దంగా ఉన్నదీ లేనిదీ రాహుల్‌ ఇంతవరకు స్పష్టం చేయలేదని చెప్పారు. బుధవారం పీటీఐ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఈ మేరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కీలక నిర్ణయాలు తీసుకునేముందు పార్టీలో విస్తృత స్థాయి చర్చలు జరగాలని తనలాంటి సంస్కరణవాదులు కోరుకుంటున్నారని చెప్పారు. చింతన శిబిరంలో సోనియా గాంధీ ప్రకటించిన సలహా బృందం కాంగ్రెస్‌లో సంస్కరణల గురించి చర్చిస్తుందని ఆశిస్తున్నామన్నారు.  లౌకికవాదమంటే మతానికి రాజకీయాలు, పాలనా వ్యవస్థ దూరం జరగడమే అయినప్పటికీ.. కాంగ్రెస్‌ తన సభ్యుల మత భావాలను గౌరవిస్తుందని థరూర్‌ వివరించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూస్తుందని చెప్పారు. ఇది అచ్చమైన లౌకికవాదం కాకపోవచ్చు కానీ, మృదు హిందుత్వం మాత్రం కాదని స్పష్టంచేశారు. హిందుత్వ అనేది హిందూ మతంతో సంబంధం లేని రాజకీయ భావజాలమన్నారు. అది అత్యధిక సంఖ్యాకుల ఆధిపత్యాన్ని సమర్థిస్తుందనీ, ఇటువంటి రాజకీయాలకు కాంగ్రెస్‌ పార్టీ బహుదూరమని వివరించారు. భావసారూప్యత గల జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసికట్టుగా 2024 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఓడించకపోతే, అత్యధిక సంఖ్యాకుల ఆధిపత్యాన్ని ప్రవచించే భాజపా నాయకత్వంలో భారతదేశం సంకుచిత నిరంకుశ వ్యవస్థగా మారిపోతుందని థరూర్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని