అగస్టా వెస్ట్‌లాండ్‌ కేసు...

అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో అరెస్టై దాదాపు నాలుగేళ్లుగా జైలులో ఉన్న క్రిస్టియన్‌ మిషెల్‌ జేమ్స్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై సమాధానమివ్వాల్సిందిగా సీబీఐ,

Updated : 19 May 2022 06:03 IST

క్రిస్టియన్‌ మిషెల్‌కు బెయిల్‌పై సీబీఐ, ఈడీ స్పందన కోరిన సుప్రీంకోర్టు

దిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో అరెస్టై దాదాపు నాలుగేళ్లుగా జైలులో ఉన్న క్రిస్టియన్‌ మిషెల్‌ జేమ్స్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై సమాధానమివ్వాల్సిందిగా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)లను సుప్రీంకోర్టు ఆదేశించింది. అత్యంత ప్రముఖుల వినియోగం కోసం రూ.3600 కోట్ల వ్యయంతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందనేది ఆరోపణం. ఈ ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మిషెల్‌ జేమ్స్‌కు దాదాపు రూ.225 కోట్ల ముడుపులు ముట్టాయని 2016లో ఈడి అభియోగాలు మోపింది. 2018 డిసెంబరులో మిషెల్‌ను దుబయ్‌లో అదుపులోకి తీసుకున్న సీబీఐ, ఈడీ అధికారులు మన దేశానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి జైలులో ఉన్న నిందితుడు బెయిల్‌ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా మార్చి 11న న్యాయస్థానం తిరస్కరించింది. దీనిని సవాల్‌ చేస్తూ మిషెల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ ధర్మాసనం...నాలుగు వారాల్లో సమాధానమివ్వాల్సిందిగా సీబీఐ, ఈడీలను ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 8,9 కింద మిషెల్‌ను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయని, ఆ నిబంధన కింద విధించే గరిష్ఠ శిక్ష అయిదేళ్లని నిందితుని తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే, నిందితుడు ఇప్పటికే మూడు సంవత్సరాల 9 నెలల పాటు జైళ్లలోనే ఉన్నారని వివరించారు. ఈ కేసు పరిశోధనలో మిషెల్‌ను విచారించాల్సిన అవసరం లేదు కనుక బెయిల్‌పై విడుదల చేయాలని అభ్యర్థించారు. సీబీఐ, ఈడీల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు...మిషెల్‌ న్యాయవాది వాదనలను తోసిపుచ్చారు. బ్రిటన్‌ నివాసి అయిన క్రిస్టియన్‌ మిషెల్‌ను అతి కష్టం మీద దుబయ్‌ నుంచి తీసుకువచ్చామని తెలిపారు. దాదాపు నాలుగేళ్లుగా జైలులో ఉన్న నిందితునికి బెయిల్‌ ఎందుకివ్వరాదో సమాధానమివ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని