విశ్వశాంతిని నెలకొల్పే దేశంగా నవ భారతాన్ని నిర్మిద్దాం

ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణలు, అశాంతి నెలకొన్న వేళ... విశ్వశాంతిని నెలకొల్పే దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో యువత భాగస్వామ్యం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Published : 20 May 2022 05:57 IST

 యువతకు ప్రధాని పిలుపు

వడోదర: ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణలు, అశాంతి నెలకొన్న వేళ... విశ్వశాంతిని నెలకొల్పే దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో యువత భాగస్వామ్యం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పురాతన సంస్కృతిని, ఆధునిక ఆలోచనలను జోడించి నవభారత నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. వడోదరలోని కుందాల్‌ధామ్, కరేలిబాగ్‌లలో ఉన్న శ్రీస్వామినారాయణ్‌ ఆలయాల ఆధ్వర్యాన గురువారం యువ సమ్మేళనం జరిగింది. దీన్ని ఉద్దేశించి మోదీ వీడియో ద్వారా ప్రసంగించారు. ‘‘సంఘర్షణలు, అశాంతి నెలకొన్న ప్రపంచానికి భారత్‌ ఒక ఆశాకిరణంలా మారింది. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమస్యకు భారత్‌ తన పురాతన సుస్థిర జీవన సంప్రదాయాల నుంచి మేలైన పరిష్కారాలు చూపుతోంది. యావత్‌ మానవాళికీ మనం యోగా మార్గాన్ని చూపుతున్నాం. ఆయుర్వేద శక్తిని వారికి పరిచయం చేస్తున్నాం. 

సమష్టి సంకల్పంతో మున్ముందుకు...

సమష్టి సంకల్పం, కృషితో నవభారత నిర్మాణానికి ముందుకు రావాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. పురాతన సంప్రదాయాలు, కొత్త ఆలోచనలతో దేశానికి కొత్త గుర్తింపు తీసుకొచ్చేలా, యావత్‌ మానవాళికి దిశానిర్దేశం చేసేలా ఈ నిర్మాణం సాగాలి’’ అని మోదీ పేర్కొన్నారు.

 ‘‘నగదు చెల్లింపులకు బదులు డిజిటల్‌ చెల్లింపులు చేపట్టగలరా?’’ అని సమావేశానికి హాజరైన యువతను మోదీ అడిగారు. మీ చిన్న సహకారం చిరు వ్యాపారుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తుందని చెప్పారు. పరిశుభ్రత పాటిస్తామని, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను వినియోగించబోమని, పౌష్టికాహార లోపాన్ని అధిగమిస్తామని ప్రతినబూనాలని సూచించారు. నాగాలాండ్‌కు చెందిన ఓ బాలిక కాశీలోని ఘాట్‌లను శుభ్రపరుస్తూ ఒంటరిగానే ప్రచారం చేపట్టిందని, ఆ తర్వాత అనేకమంది ఆ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని ఈ సందర్భంగా మోదీ ఉదహరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని