Heavy Rains: బెంగళూరులో ఎడతెరిపిలేని భారీ వర్షం.. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌!

కర్ణాటకను వరుసగా మూడో రోజూ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో .....

Published : 19 May 2022 23:02 IST

బెంగళూరు: కర్ణాటకను వరుసగా మూడో రోజూ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మంగళవారం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. దక్షిణ కన్నడ, ఉడుపి, మైసూరు, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. దక్షిణ కన్నడ జిల్లాలో రెండో రోజు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, అన్‌ఎయిడడ్‌ ప్రైమరీ, హైస్కూళ్లకు సెలువులు ప్రకటించారు. అటు, బెంగళూరులో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ ఇళ్లల్లోకి వరదనీరు ముంచెత్తడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నగరంలోని పలు రోడ్లు ధ్వంసం కాగా.. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోని కృష్ణరాజసాగర్‌, కబిని, హరంగి, హేమావతి, అల్మట్టి, నారాయణపుర, భద్ర, తుంగ,  ఘటప్రభ, మలప్రభ వంటి జలాశయాలన్నీ భారీ వర్షాలకు నిండు కుండల్లా మారాయి.

నాలుగుకి చేరిన మృతులు

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నలుగురు మృతిచెందారు. బెంగళూరులోని జనభారతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పైపులైన్‌ ప్రాజెక్టులో పనిచేస్తూ ఇద్దరు వలస కూలీలు ప్రాణాలు కోల్పోగా.. దొడ్డబల్లాపూర్‌లో విద్యుదాఘాతానికి గురై 38 ఏళ్ల వ్యక్తి, హసన్‌ జిల్లాలో పాఠశాల భవనం గోడ కూలి ఓ వృద్ధుడు మృతిచెందాడు. మరోవైపు, కర్ణాటకలో ఏడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాబోయే 24గంటల్లో దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, హసన్‌, కొడగు, శివమొగ్గ జిల్లాలకు భీరీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. మరోవైపు, వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం బసవరాజ్‌ బొమ్మై సందర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని