India-Pak: అంతర్జాతీయ వేదికపై పాక్‌ అక్కసు.. భారత్‌ తీవ్ర అభ్యంతరం

భారత్‌పై పాకిస్థాన్‌ మరోసారి తన అక్కసును వెల్లగక్కింది. జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని మరోసారి లేవనెత్తుతూ.......

Published : 20 May 2022 21:41 IST

జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని పునరుద్ఘాటన

దిల్లీ: భారత్‌పై పాకిస్థాన్‌ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. అంతర్జాతీయ వేదికపై జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని మరోసారి లేవనెత్తుతూ.. ఆర్టికల్​ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్​తో సంబంధాలు మరింత సంక్లిష్లమైనట్లు పేర్కొంది. కాగా ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్ భారత్​లో అంతర్భాగమని పునరుద్ఘాటించింది. పాకిస్థాన్​ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంటోందని మండిపడింది.

అమెరికాలో తొలిసారి పర్యటిస్తున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్​తో సంబంధాలు మరింత సంక్షిష్టమయ్యాయని పేర్కొన్నారు. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీశాయని అభిప్రాయపడ్డారు. ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం, జెనీవా కన్వెన్షన్​ను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఆర్థిక కార్యకలాపాలు, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కారం అవుతాయని తాము అర్థం చేసుకున్నామన్నారు. కానీ ఇలాంటి దూకుడు ప్రవర్తన కారణంగా చర్చలు జరగడానికి అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు.

గోధుమ ఎగుమతులపై భారత్​ నిషేధం విధించడంపై బుట్టో స్పందించారు. అది భారత ప్రభుత్వ అంతర్గత నిర్ణయమని.. కానీ ఇలాంటి చర్యలు అంతర్జాతీయ సంస్థలను నిరుత్సాపరుస్తాయని పేర్కొన్నారు. ఆహార భద్రత లక్ష్యాలను చేరుకోలేనివారి అవసరాలను తీర్చేందుకు మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

విద్వేష ప్రసంగాలు నిజాన్ని దాచలేవు

జమ్ముకశ్మీర్​పై పాక్‌ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్​ మండిపడింది. పాకిస్థాన్​ ప్రతి వేదికను భారత్​కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ భద్రతా మండలి నిర్వహించిన ‘అంతర్జాతీయ శాంతి, ఆహార భద్రత’ అంశంపై చర్చలో భారత శాశ్వత కౌన్సిలర్​ రాజేశ్​ పరిహార్​ స్పందించారు. ‘కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​​ భారత్​లో అంతర్భాగం. ఇందులో పాకిస్థాన్​ ఆక్రమించిన ప్రాంతాలు ఉన్నాయి. మీరు ఎన్ని విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా ఈ వాస్తవాన్ని కాదనలేరు’ అని పరిహార్‌ పేర్కొన్నారు.

అనవసర వ్యాఖ్యలు చేయొద్దు

ఆర్టికల్​ 370ని రద్దు చేయడం తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి భారత్ పునరుద్ఘాటించింది. జమ్ముకశ్మీర్​ భారత్​లో అంతర్భాగమన్న వాస్తవాన్ని అంగీకరించాలని.. భారత్​ వ్యతిరేక ప్రచారాలని మానుకోవాలని హితవు పలికింది. అనవసర వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. ఉగ్రవాదం, హింస లేని సంబంధాలను తాము కోరుకుంటున్నామని పాకిస్థాన్​కు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని