Delhi Mundka fire: డివైడర్‌ విరగ్గొట్టుకొని ఆ భవనం వైపు వెళ్లాం.. దిల్లీలో ఆ రోజేం జరిగిందంటే?

దేశ రాజధాని దిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమైన ఘటన పెను......

Published : 19 May 2022 02:18 IST

50మందిని కాపాడిన క్రేన్‌ డ్రైవర్‌ దయానంద్‌ తివారీ మాటల్లో..

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమైన ఘటన పెను విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాద సమయంలో ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకోక ముందే ‘ఆపద్బాంధవుడిలా’ చేరుకొని 50మందిని ప్రాణాలను కాపాడిన ఓ ట్రక్‌ డ్రైవర్‌ దయానంద్‌ తివారీపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తనపై వస్తోన్న ప్రశంసలపై స్పందించిన తివారీ.. సాటి మనిషిగా తన బాధ్యతను మాత్రమే నిర్వర్తించానని.. తాను చేసింది అసాధారణమేమీ కాదంటూ సింపుల్‌గా చెప్పుకొచ్చారు. మే 13న శుక్రవారం దిల్లీలో ఈ విషాదం జరిగిన రోజు అసలేం జరిగిందో గుర్తు చేసుకున్నారు.

‘‘ఆ రోజు పని ముగించుకొని నేను, నా సోదరుడు అనిల్‌ తివారీ ఆ ప్రాంతం వైపు వెళ్తున్నాం. నాలుగంతస్తుల భవనం నుంచి దట్టమైన పొగలు, కొందరు భయంతో చేస్తున్న అరుపులు వినబడ్డాయి. భవనంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు కొందరు ప్రయత్నించడం నేను గమనించాను. దీంతో నేను, అనిల్ అక్కడికి ఎలాగైనా వెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ, అగ్ని కీలలు ఎగసిపడుతుండటంతో అక్కడ ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది. దీంతో డివైడర్‌ని విరగ్గొట్టుకొని మేం భవనం వద్దకు చేరుకున్నాం. భవనం లోపల ఉన్నవారు బయటకు వచ్చేందుకు మార్గాలేమీ కనబడలేదు. అందుకే భవనం అద్దాన్ని పగలగొట్టాం. అప్పుడు నాలుగు నుంచి ఆరు బ్యాచ్‌లలో 50 మందిని ప్రాణాలతో కాపాడగలిగాం. మంటలు ఎగసి పడటం.. పొగలు కమ్ముకోవడంతో భవనం వద్ద వేడి పెరగడంతో సహాయక చర్యలు కష్టంగామారాయి. దీంతో లోపల ఉన్నవారిని రక్షించడం అసాధ్యం కావడంతో మేం సహాయక చర్యలను నిలిపివేయాల్సి వచ్చింది’’ అని దయానంద్‌ తివారీ వివరించారు. బిహార్‌కు చెందిన దయానంద్‌ తివారీ 25 ఏళ్ల క్రితమే దిల్లీకి వచ్చి మండ్కా పరిసరాల్లోనే నివాసం ఉంటున్నారు. ‘‘ఓ మనిషిగా సాటి మనిషికి సాయం చేయడం నా బాధ్యత. నేనేదో అసాధారణమైన పనిచేశానని అనుకోవడంలేదు. భగవంతుడు ఆ సమయంలో నన్ను అక్కడ ఉంచడం వల్లే నేను సాయం చేయగలిగాను’’ అని చెప్పుకొచ్చారు.

ఆ క్రేన్‌ లేకపోతే ఏం జరిగి ఉండేదో!

ఈ ఘోర అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన వారు క్రేన్‌ డ్రైవర్‌ దయానంద్‌ తివారీకి అభినందనలు తెలిపారు. ఆయన తొలిసారి కాపాడిన మాలతి అనే మహిళ స్పందిస్తూ.. ‘రెస్క్యూ ఆపరేషన్‌ కోసం ఆ సమయంలో అక్కడ క్రేన్‌ లేకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించలేకపోతున్నా. ఓ ‘మెస్సయ్య’లా దయానంద్‌ వచ్చారు.. అనేకమందిని కాపాడారు’’ అని మెచ్చుకున్నారు. ‘‘దయానంద్‌ లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. భవనంలో చిక్కుకున్న మేమంతా ఎలా బయటపడాలా అని చూస్తున్నాం. మెట్ల మార్గంలో పొగలు అలముకున్నాయి. చాలా భయం వేసింది.అక్కడ ఓ క్రేన్‌ ఉందని ఎవరో చెప్పారు. దానివైపు పరుగులు తీశాం. దయానంద్‌ అక్కడ లేకపోతే నేను బతికి ఉండేదాన్నికాదు’’ అని మమత అనే మరో మహిళ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని