US Independence Day: బైడెన్‌కు మోదీ శుభాకాంక్షలు!

245వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (జులై 4న) జరుపుకుంటోన్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Published : 04 Jul 2021 21:40 IST

245వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ అమెరికాలో సంబరాలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా 245వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (జులై 4న) ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు యావత్‌ అమెరికా ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్న భారత్‌, అమెరికాలు.. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల విలువలకు ప్రాధాన్యత ఇస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని ప్రధాని మోదీ ట్విటర్‌లో వెల్లడించారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొనే అమెరికా.. కరోనా కారణంగా గతేడాది వేడుకలను దూరంగా ఉంది. ప్రపంచంలో కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి తీవ్రంగా వణికిపోయిన అమెరికా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం కావడం, కొవిడ్‌ మరణాలు తగ్గుముఖం పట్టడం, వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రావడంతో మహమ్మారి నుంచి విముక్తి పొందినట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలో జులై 4న జరిగే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారీ స్థాయిలో వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమం ద్వారా మహమ్మారిపై అమెరికా విజయం సాధించిందనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని జో బైడెన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, కొవిడ్‌ పోరులో ముందు నిలిచిన పౌరులు, వివిధ విభాగాలకు చెందిన నిపుణులు, ఆర్మీ సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులకు వైట్‌హౌస్‌ గార్డెన్‌లో ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే, బ్రిటీష్‌ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు గురైన అమెరికా.. 1776 జులై 4న స్వాతంత్ర్యం పొందిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని