Peace talks: ఆ షరతుకు అంగీకరిస్తేనే.. నక్సల్స్‌తో శాంతి చర్చలు: సీఎం బఘేల్‌

తమ ప్రభుత్వంతో షరతులతో కూడిన చర్చలకు మావోయిస్టులు సుముఖత వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. సుక్మా జిల్లాలో పర్యటనలో భాగంగా గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.......

Published : 20 May 2022 01:53 IST

రాయ్‌పూర్‌: నక్సల్‌తో శాంతి చర్చలు అంశంపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం పట్ల నక్సల్స్‌ విశ్వాసం ప్రకటిస్తేనే శాంతి చర్చలు జరుగుతాయన్నారు. తమ ప్రభుత్వంతో షరతులతో కూడిన చర్చలకు మావోయిస్టులు సుముఖత వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. సుక్మా జిల్లాలో పర్యటనలో భాగంగా గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టులు పేర్కొన్న షరతుల విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. చర్చలకు బస్తర్‌ కంటే మంచి ప్రదేశం ఏమీ లేదని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం మొదలైందే సుక్మా ప్రాంతంలో. ఇక్కడి నుంచే వారి తిరోగమనం కూడా జరుగుతోంది. నక్సల్స్‌ ప్రభావం క్షీణిస్తోంది. వారు చర్చలు జరపాలనుకుంటే.. మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ ఒక షరతు. రాజ్యాంగం పట్ల నక్సల్స్‌ విశ్వాసం ప్రకటిస్తేనే చర్చలు జరుగుతాయి’’ అని బఘేల్‌ తేల్చి చెప్పారు. 

‘‘వారితో నేను ఏ ప్రాతిపదికన చర్చలు జరపాలి? భారతదేశం ఫెడరల్ రిపబ్లిక్. ఒక రాష్ట్రానికి సీఎంగా నేను ఎవరితోనైనా ముఖాముఖిగా మాట్లాడితే.. అవతలి వ్యక్తి రాజ్యాంగంపై నమ్మకం కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైన అంశం. వారు భారత రాజ్యాంగాన్ని విశ్వసించకపోతే నేను చర్చలు జరపలేను. సుక్మా అయినా ఇంకెక్కడైనా చర్చలకు రెడీ.. కానీ రాజ్యాంగం పట్ల విశ్వాసం ప్రకటిస్తేనే..’’ అని తెలిపారు. 

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందుకు కొన్ని షరతులు పెట్టారు. జైళ్లలో ఉన్న తమ నేతలను విడుదల చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. అయితే, దీనిపై ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి తామరద్వాజ్‌ సాహు స్పందిస్తూ .. భేషరతుగా చర్చలు జరుపుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని