Congress: పేరరివాళన్‌ విడుదలకు ఉత్తర్వులు.. కాంగ్రెస్‌ రియాక్షన్‌ ఇదే..!

రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌ విడుదలపై కాంగ్రెస్‌ తీవ్ర అంసంతృప్తి, బాధను వ్యక్తం చేసింది........

Published : 19 May 2022 02:22 IST

(రణ్‌దీప్‌ సూర్జేవాలా)

దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ఎ.జి. పెరారివాళన్‌ను విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. కాగా దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర అంసంతృప్తి, ఆవేదనను వ్యక్తంచేసింది. అధికార పార్టీ కోర్టులో ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చిందని ఆరోపించింది. చౌకబారు రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ప్రధానమంత్రిని చంపిన వ్యక్తిని విడుదల చేయడానికి న్యాయస్థానంలో ఈ తరహా ‘పరిస్థితి’ని సృష్టించిందంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది.

ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. తాజా నిర్ణయం పట్ల కాంగ్రెస్‌ కార్యకర్తలే కాదు.. ప్రతి భారతీయుడూ దు:ఖం, ఆవేశంతో ఉన్నారని పేర్కొన్నారు. ‘ఓ ఉగ్రవాది ఎన్నటికీ ఉగ్రవాదే. రాజీవ్‌ గాంధీని చంపిన దోషిని విడుదల చేయాలంటూ ఆదేశాలు వెలువడటం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది’ అని అన్నారు. ‘ఈరోజు దేశానికే దుర్దినం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి భారతీయడు దుఃఖంలో ఉన్నాడు’ అని సూర్జేవాలా వ్యాఖ్యానించారు. ‘రాజీవ్‌ గాంధీ కాంగ్రెస్‌ కోసం కాదు, దేశం కోసం ప్రాణాలర్పించారు. చిల్లర, చౌకబారు రాజకీయాల కోసం రాజీవ్‌ గాంధీ హంతకులను విడుదల చేసే పరిస్థితిని ఈ ప్రభుత్వం కోర్టులో సృష్టిస్తే.. ఇది చాలా దురదృష్టకరం, ఖండించదగిన విషయం’ అని సూర్జేవాలా పేర్కొన్నారు.

రాజీవ్‌ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు ఈరోజు కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి. పెరారివాళన్‌ విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పెరారివాళన్‌ విడుదలతో ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్‌ సహా ఇతర నిందితుల విడుదలకు కూడా మార్గం సుగమమైనట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని