Technology: కొవిడ్‌ పోరులో ‘సాంకేతికతే’ గేమ్‌ఛేంజర్‌..: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరతతో పాటు మౌలిక సదుపాయాల సమస్యలున్న మన దేశంలో సాంకేతికతను సక్రమంగా వినియోగించుకుంటే ‘గేమ్‌ఛేంజర్‌’గా ఎలా అవుతుందో తాజాగా కొవిడ్‌ మహమ్మారి మరోసారి నిరూపించిందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు.

Published : 22 Oct 2021 19:46 IST

టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని మరోసారి నిరూపించిందన్న రణ్‌దీప్‌ గులేరియా

దిల్లీ: సాంకేతికత ప్రాముఖ్యాన్ని కొవిడ్‌ మహమ్మారి మరోసారి తెలియజేసిందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరతతో పాటు మౌలిక సదుపాయాల సమస్యలున్న మన దేశంలో సాంకేతికతను సక్రమంగా వినియోగించుకుంటే ‘గేమ్‌ఛేంజర్‌’గా ఎలా అవుతుందో తాజాగా కొవిడ్‌ మహమ్మారి మరోసారి నిరూపించిందన్నారు. పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 8వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆరోగ్యవంతమైన దేశం లేకుంటే ఆర్థికవ్యవస్థ, పర్యాటకం, ప్రయాణాలతో పాటు అన్నివిధాలా తీవ్ర నష్టం కలుగుతుందనే విషయాన్ని కొవిడ్‌ మహమ్మారి చూపించిందన్నారు.

దేశంలో కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చిన భారత్‌.. అత్యంత వేగంగా టెలీకన్సల్టేషన్‌ పద్ధతిని అలవరచుకుందని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. తద్వారా ఆస్పత్రులకు రాకుండానే దేశవ్యాప్తంగా ఎంతో మంది రోగులు తక్కువ ఖర్చుతో వైద్య సేవలను పొందారని గుర్తుచేశారు. ఇలాంటి ఎన్నో విభాగాల్లో సాంకేతికత దోహదపడిందని చెప్పారు. ఆరోగ్యం విషయానికొస్తే దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చాలా వ్యత్యాసం ఉందని.. ఈ సమస్యపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఇదే వ్యత్యాసాన్ని సాంకేతికత మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సాంకేతికతపై అంత పట్టు లేనివారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని గులేరియా ఉద్ఘాటించారు.

అసంక్రమిత వ్యాధులు, క్యాన్సర్లపై శిక్షణ ఇవ్వడం ద్వారా ఆరోగ్య రంగంపై ఉన్న ఒత్తిడిని భారీగా తగ్గించవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సూచించారు. ఇందుకోసం పరిశోధనలకు భారీగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. సాంకేతిక రంగంలో ఇదే అత్యంత ముఖ్యమైన విషయమని గులేరియా పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా చాలా విభాగాల్లో ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చని జాతీయ ఆరోగ్య సంస్థ (NHA) సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని