Rajasekhar: నా జీవితం అక్కడితో ముగిసిపోతుందనుకున్నా: రాజశేఖర్‌

కొవిడ్‌ వల్ల ఎంతో ఇబ్బందిపడ్డానని, ఒకానొక సమయంలో తన జీవితం ముగిసిపోయిందనుకున్నానని ప్రముఖ నటుడు రాజశేఖర్‌ అన్నారు. తన భార్యాబిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే మళ్లీ మామూలు మనిషినయ్యానని తెలిపారు. తాను హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు.

Updated : 07 Dec 2022 19:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కొవిడ్‌ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డానని, ఒకానొక సమయంలో తన జీవితం ముగిసిపోయిందనుకున్నానని ప్రముఖ నటుడు రాజశేఖర్‌ అన్నారు. తన భార్యాబిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే మళ్లీ మామూలు మనిషినయ్యానని తెలిపారు. తాను హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఆయన సతీమణి జీవిత దర్శకత్వం వహించిన చిత్రమిది. మే 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను విలేకరులతో పంచుకున్నారు. ఆ సంగతులివీ..

* ఎప్పుడూలేనిది ఈ సినిమాను బతికించండని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎందుకు అన్నారు?

రాజశేఖర్‌: ఇంతకాలం నా దగ్గర ప్రాపర్టీ ఉంది. ప్రస్తుతం అప్పుల్లో ఉన్నా. ఈ సినిమా విజయం అందుకుంటేనే వాటి నుంచి బయటపడగలను. ఈ పరిస్థితి వల్లే ఆరోజు వేదికపై అలా మాట్లాడాల్సి వచ్చింది. ఈ సినిమా విషయంలో ఎప్పుడూ లేనిది తొలిసారి ఒత్తిడి ఫీలవుతున్నా. ఓ మంచి, విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా. వారిని నిరుత్సాహపరచననే నమ్మకం ఉంది. సినిమా బాగుందని తెలిస్తే థియేటర్‌కు వచ్చి చూడాలని ఆడియన్స్‌ను కోరుతున్నా.

* ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

రాజశేఖర్‌: ‘శేఖర్’ చిత్రం నటుడిగా నాకెంతో సంతృప్తినిచ్చింది. ఇందులోని హీరో పాత్ర భావోద్వేగంతో కూడుకున్నది. నటనకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎమోషన్‌ పండించేందుకు నా వంతు కృషి చేశా. లుక్‌ విషయంలోనూ చాలా జాగ్రత్త పడ్డా. 55 ఏళ్ల వ్యక్తి పాత్ర అయినా స్టైలిష్‌గా కనిపించాలని సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ ప్రయత్నించా. ఈ గెటప్‌లో నన్ను చూసినవారంతా చాలా బాగుందని కితాబిచ్చారు. ఇది వర్కౌట్‌ అవుతుందని అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ట్రైలర్‌ విడుదల తర్వాత మరికొంతమంది మెచ్చుకున్నారు. ఫస్ట్‌లుక్‌, ప్రచార చిత్రాలు బాగున్నాయని అంటున్నారు కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం బలపడింది.

* మలయాళ చిత్రం ‘జోసెఫ్‌’ను ఎందుకు రీమేక్‌ చేయాలనిపించింది?

రాజశేఖర్‌: నేను గతంలో నటించిన ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘మగాడు’, ‘మా అన్నయ్య’, ‘మా ఆయన బంగారం’, ‘సింహరాశి’, ‘శేషు’ తదితర సినిమాలు రీమేక్‌గా రూపొందినవే. శేషు మినహా మిగిలిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. రీమేక్‌ సినిమాల విషయంలో మనం ఏం చేయబోతున్నామో, పాత్ర ఎలా ఉండబోతుందో ముందే తెలుస్తుంది. ఆయా సినిమాలు మాతృకలో సూపర్‌హిట్‌ కాబట్టి ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తాయనే మినిమం గ్యారెంటీ ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే ‘జోసెఫ్‌’ను ఎంపిక చేసుకున్నా. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు కొంచెం మార్పులు చేశాం.

* మీ సతీమణే ఈ సినిమాకు డైరెక్టర్‌. సెట్స్‌లో వాతావరణం ఎలా ఉండేది?

రాజశేఖర్‌: సెట్స్‌లో డైరెక్టర్‌- నటుడిగానే ఉండేవాళ్లం. ఓ దర్శకురాలిగా సన్నివేశానికి ఏం కావాలో తను వివరిస్తుంది. ఆ ఇన్‌పుట్స్‌ మేరకు నేను నటించేవాడ్ని. ఒక్కోసారి ఇద్దరం చర్చించుకుని, ఎవరి ఆలోచన బాగుంటే అది ఫాలో అయ్యేవాళ్లం. నేనే కాదు ఆయా పాత్రకు సంబంధించిన నటుల నుంచి ప్రతిభను బయటకు తీస్తుంది తను. జీవిత గొప్ప డైరెక్టర్‌ అని చెప్పగలను.

* మీ తనయ శివానీతో నటించడం ఎలా అనిపించింది?

రాజశేఖర్‌: ఇందులోని కూతురు పాత్ర కోసం నేను వేరే నటిని తీసుకుందామని చెప్పా. కానీ, జీవిత ఒప్పుకోలేదు. మన ఇద్దరి పిల్లల్లో ఎవరో ఒకరు చేస్తే బాగుంటుందని వివరించింది. సరే అని ‘మీ ఇద్దరిలో ఎవరు నటిస్తారు’ అని శివానీ, శివాత్మికను అడిగాం. తాను నాతో తర్వాత నటిస్తానని చెప్పి శివాత్మిక తప్పుకుంది. అలా శివానీ ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టింది. తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది.

* సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ గురించి చెప్తారా?

రాజశేఖర్‌: ఈ సినిమాకు అనూప్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. డైలాగ్స్‌ ఉండని కొన్ని సన్నివేశాలను నేపథ్య సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్లాడు.

* కొవిడ్‌ను ఎలా ఎదుర్కొన్నారు?

రాజశేఖర్‌: నాకు కొవిడ్‌ వచ్చినప్పుడు చాలా సీరియస్‌ అయింది. నడవలేకపోయేవాడ్ని. బోర్‌ కొట్టకుండా ఉండేందుకు నాకోసం ఐసీయూలో టీవీ పెట్టారు. హీరోలు చేసే డ్యాన్స్‌, పోరాటాలు చూసి నేనూ అలానే ఉండేవాడ్ని కదా ఇలా అయిపోయానేంటనే బాధ మొదలైంది. నా జీవితం ముగిసిపోతుందనే భయం వేసింది. అదే సమయంలో మా అక్క ఫోన్‌ చేస్తే విషయం చెప్పి ఏడ్చేశా. అప్పుడు నాపై నాకు నమ్మకం లేకపోవడంతో ‘జోసెఫ్‌’ చిత్ర హక్కులను ఎవరికైనా ఇచ్చేమని జీవితకు చెప్పా. కానీ, ఆమె నేను కోలుకుంటానని ధైర్యానిచ్చింది. జీవిత, పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేను. ఎలా అయినా ఈ సినిమా చేయాలనే కసితో మళ్లీ మామూలు మనిషిని అయ్యా.

* తదుపరి చిత్రాలేంటి?

రాజశేఖర్‌: ప్రముఖ దర్శకుడితో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ చిత్రం చేయబోతున్నా. దాని గురించి ఇప్పుడేం చెప్పలేను. మరోవైపు, మా కుటుంబమంతా కలిసి నటించాలని కొందరు అడుగుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని