‘అబీబీ అబీబీ’ బీట్‌కు ఆ పాటే మూలం!

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అదిరిపోయే స్టెప్‌లతో అలరించే కథానాయకుడు ఎవరంటే మొదటగా గుర్తొచ్చే పేరు చిరంజీవి.

Published : 07 Apr 2022 14:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అదిరిపోయే స్టెప్‌లతో అలరించే కథానాయకుడు ఎవరంటే మొదటగా గుర్తొచ్చే పేరు చిరంజీవి. ఇక నేటి యువ కథానాయకుల జాబితాలో అలాంటి వారే చాలామందే ఉన్నారు. అయితే, చిరంజీవి పాటల్లో కొన్ని గీతాలకు ప్రత్యేక స్టెప్‌లు వేశారు. అలాంటి వాటిలో ‘హిట్లర్‌’లో ‘నడక కలిసిన నవరాత్రి’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రంభ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక కోటి సంగీత సారథ్యంలో పాటలన్నీ హిట్‌. ‘నడక కలిసిన నవరాత్రి’ పాటైతే సూపర్‌ హిట్‌. ఎందుకంటే అందులో ‘అబీబీ.. అబీబీ..’ అంటూ సాగే ఈ పాటలో చిరు స్టెప్‌ ఎవర్‌గ్రీన్‌. దీనికి లారెన్స్‌ నృత్యాలు సమకూర్చారు.

ఈ పాటకు స్ఫూర్తిగా ‘దీదీ’ అనే ఒక అరబిక్‌ గీతాన్ని అనుకరించడం గమనార్హం. అరబిక్‌ గీతం ‘నడక’ను మాత్రమే అనుకరిస్తూ, ఆధునిక సంగీత రీతులకు అనుగుణంగా ఈ పాటకు సొబగులద్దడం గొప్పనే చెప్పుకోవాలి. ఈ అరబిక్‌ పాటను సొంతంగా రాసి ఆలపించిన ఆ అల్జీరియన్‌ గాయకుని పేరు ఖాలెద్‌. ‘లా ఝుర్‌ల మిమూయున్‌ ర్కూచ్‌ జైన్‌.. క్వీస్‌ ఇల్‌ షబ్క ఫిల్‌ భర్‌ విబ్కిఆల లిజర్‌ దీదీ.. దీదీ.. దీదీ’ అంటూ సాగే ఈ ‘దీదీ’ ఆల్బం మొదట 1991లో విడుదలైంది. ఫ్రెంచ్‌ సింగిల్స్‌ చార్టడ్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచి బాగా జనరంజకమైంది. ఇరవై వారాల పాటు తొలి యాభై గొప్ప ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు స్విట్జర్లాండ్‌, బెల్జియం, ఈజిప్టు, సౌదీ అరేబియా దేశాల్లో సింగిల్‌ చార్టుల్లో ప్రథమస్థానం నిలుపుకొంది. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ పోటీల ప్రారంభోత్సవంలో ఖాలెద్‌ ‘దీదీ’ పాటను ఆలపించి జేజేలు అందుకున్నాడు. కోటి సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ పాట తెలుగులోనూ ప్రేక్షకాభిమానం సొంతం చేసుకుంది. చిరు వేసిన స్టెప్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. ఆ తర్వాత ఆ స్థాయిలో చిరంజీవికి పేరు తెచ్చిన స్టెప్‌ ‘ఇంద్ర’లో వీణ స్టెప్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని