కలల చిత్రం.. కళగా మార్చాలని ..!

కలలు కనడం సులభమే. వాటిని సాకారం చేసుకోవడానికే అకుంఠిత దీక్షతో శ్రమించాల్సి ఉంటుంది. ఇలా శ్రమించి తమ కలల్ని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు. ఇక సినీ ప్రపంచంలో కలలన్నీ ఖరీదైనవిగానే ఉంటాయి. అందుకే ఇక్కడ తమ కలల చిత్రాల్ని సాకారం చేసుకోవడానికి ఎంత పెద్ద దర్శకుడైనా ఏళ్లకు ఏళ్లు నిరీక్షించక తప్పదు.

Updated : 30 Jun 2022 06:48 IST

కలలు కనడం సులభమే. వాటిని సాకారం చేసుకోవడానికే అకుంఠిత దీక్షతో శ్రమించాల్సి ఉంటుంది. ఇలా శ్రమించి తమ కలల్ని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు. ఇక సినీ ప్రపంచంలో కలలన్నీ ఖరీదైనవిగానే ఉంటాయి. అందుకే ఇక్కడ తమ కలల చిత్రాల్ని సాకారం చేసుకోవడానికి ఎంత పెద్ద దర్శకుడైనా ఏళ్లకు ఏళ్లు నిరీక్షించక తప్పదు. జయాపజయాలు.. ఇమేజ్‌ లెక్కలు.. బడ్జెట్‌ తిప్పలు.. ఇలా బోలెడన్ని చిక్కులు దాటొస్తే గానీ కలల సినిమా... చిత్ర కళగా కార్యరూపంలోకి రాదు. ఇప్పుడిలాంటి ఒడుదొడుకులన్నీ దాటుకొని.. తమ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లను ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు పలువురు దర్శకులు. మరి వారెవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..

మణిరత్నం కల

‘నాయకుడు’, ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’, ‘ఇద్దరు’.. ఇలా భారతీయ సినీప్రియులకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించిన దర్శకుడు మణిరత్నం. ఇప్పుడాయన నుంచి రానున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఇది మణిరత్నం కలల సినిమా. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా రూపొందింది. చోళుల కాలం నాటి ఆసక్తికర కథాంశంతో పీరియాడికల్‌ సినిమాగా ముస్తాబవుతోంది. మణిరత్నం గతంలో ఎన్నోసార్లు ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్రయత్నించారు. బడ్జెట్‌ సమస్యల వల్ల అతి కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్‌ కోసం మహేష్‌బాబును సంప్రదించినట్లూ వార్తలు వినిపించాయి. అయితే భాగస్వామ్య పద్ధతిలో ఈ సినిమా నిర్మించేందుకు లైకా సంస్థ ముందుకు రావడంతో.. మూడేళ్ల క్రితం ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం పట్టాలెక్కింది. ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న తొలి భాగం.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న విడుదల కానుంది. ఇందులో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, శోభిత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


కమల్‌ జోరు..

‘విక్రమ్‌’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు కథానాయకుడు కమల్‌హాసన్‌. ఇప్పుడీ జోష్‌లోనే ఇన్నాళ్లు అటకెక్కిన తన కలల ప్రాజెక్టుల్ని ఒకొక్కటిగా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. కమల్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌లో ‘మరుదనాయగం’, ‘మర్మయోగి’ సినిమాలతో పాటు ‘శభాష్‌ నాయుడు’ అనే మరో చిత్రం ఉన్న సంగతి తెలిసిందే. ‘దశావతారం’లోని బలరామ్‌ నాయుడు పాత్ర ఆధారంగా ఈ కథని తీర్చిదిద్దారు. 2016లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా.. ఆ తర్వాత బడ్జెట్‌ సమస్యల వల్ల ఆగిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని కమల్‌ తిరిగి పట్టాలెక్కించనున్నారని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. దీన్ని ఆయన తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఆయన తనయ శ్రుతిహాసన్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘భారతీయుడు2’ పూర్తయిన వెంటనే ఇది సెట్స్‌పైకి వెళ్లనుందని ప్రచారం వినిపిస్తోంది.

పూరి.. ‘జనగణమన’

దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలల చిత్రమనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘జన గణమన’. ఈ సినిమాని అప్పట్లో మహేష్‌బాబుతో పట్టాలెక్కించాలని ప్రయత్నించారు పూరి. ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్‌’ వంటి విజయాల తర్వాత వీరి కలయికలో రానున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో ఆరోజుల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఈ కథను వెంకటేష్‌కు వినిపించినట్లు వార్తలు వినిపించాయి. అదీ నిజం కాలేదు. పూరి ఎట్టకేలకు తన కలల చిత్రాన్ని విజయ్‌ దేవరకొండతో పట్టాలెక్కించనున్నారు. దీన్ని ఛార్మి కౌర్‌, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో సాగే హై ఓల్టేజ్‌ యాక్షన్‌ చిత్రమిది. ముంబయితో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణ జరపనున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విజయ్‌తో పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘లైగర్‌’ విడుదలకు సిద్ధమవుతోంది.


‘మహాభారతం’ ఊరిస్తోంది

‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకుడు రాజమౌళి. ఆయన చిరకాల స్వప్నం ‘మహాభారతం’ సినిమా. కచ్చితంగా ఆ చిత్రం పట్టాలెక్కిస్తానని ఆయన ఎన్నో సందర్భాల్లో ప్రకటించారు. అయితే దానికి మరింత సమయం పడుతుందని, ఇంకా ఎంతో అనుభవం సంపాదించాల్సి ఉందని పలు వేదికలపై తెలిపారు. ఆ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కినా.. అది చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా ఉంటుందని, దేశంలోని అగ్రతారలంతా అందులో నటిస్తారని ఇప్పటికే స్పష్టత ఇచ్చేశారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని