ఆ రోజు చిరంజీవి, బాలకృష్ణ నా మాట వినలేదు: పరుచూరి గోపాలకృష్ణ

సినీ పరిశ్రమలో కథానాయకుడి బాడీ లాంగ్వేజ్‌ బట్టి కథలు, అందులోని సన్నివేశాలు ఉండాలని, అప్పుడే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారని,

Published : 10 May 2022 02:23 IST

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో కథానాయకుడి బాడీ లాంగ్వేజ్‌ బట్టి కథలు, అందులోని సన్నివేశాలు ఉండాలని, అప్పుడే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారని, ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో ఆయన అనేక అంశాలపై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కథానాయకుల బాడీ లాంగ్వేజ్‌, అందుకు సరిపోయే కథల గురించి మాట్లాడారు.

చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ గురించి కూడా ప్రస్తావించారు. చిరంజీవి నక్సలైట్‌ పాత్ర పోషించడంతో కొన్ని పరిమితులకు లోబడి నటించాల్సి వచ్చిందన్నారు. గతంలో ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆ సినిమా చిరు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని చెప్పానన్నారు. చిరంజీవి ఇమేజ్‌ మహావృక్షంలాంటిదని, అలాంటి వ్యక్తి ‘శాంతి’ వచనాలు చెబితే ప్రేక్షకులకు రుచించదని అన్నారు. ఇదే విషయాన్ని అప్పట్లో చిరు దృష్టికి తీసుకొస్తే, ‘మీరు కాస్త రెబల్‌ కాబట్టి, మీకు పెద్దగా నచ్చదులేండి’ అన్నట్లు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారని గోపాలకృష్ణ అన్నారు. ఎందుకంటే ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు’లోనూ ఎన్టీఆర్‌ ఇలాగే నటిస్తే ఆ సినిమా దెబ్బతిన్నదని గుర్తు చేసుకున్నారు. చిరంజీవిలాంటి హీరోకు ఉన్న అభిమానగణం తమను ఎంటర్‌టైన్‌చేసేలా సినిమా ఉండాలని కోరుకుంటారని వివరించారు.

అలాగే బాలకృష్ణ ‘అల్లరి పిడుగు’ సమయంలోనూ ఇలాగే జరిగిందని చెప్పారు. అందులో తండ్రి పాత్ర కూడా ఆయననే వేయమని రిక్వెస్ట్‌ చేశానని చెప్పారు. ‘తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని, ముంబయి నుంచి వచ్చిన ఓ కొత్త నటుడిని చూసి బాలకృష్ణ భయపడుతుంటే జనానికి నచ్చదు. తండ్రి పాత్ర కూడా మీరే వేయండి బాబూ ’ అని చెప్పానన్నారు.  కానీ, ఆ రోజు దర్శకుడు, నిర్మాత అంగీకరించలేదని, ఆ తర్వాత దెబ్బతిన్నారని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే బాలకృష్ణ స్టామినాకు ఆయన ఎవరికో భయపడకూడదని, అందులోనూ పరిచయం లేని నటుడికి భయపడినట్లు చేస్తే, బాగుండదని అన్నారు. ‘పెద్దన్నయ్య’లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తే, చూశారని, అందరికీ నచ్చిందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని