Rajinikanth: అక్కడ తెలుగు చంద్రముఖి..ఇక్కడ తమిళ చంద్రముఖి..

రజనీకాంత్‌(Rajinikanth) కథానాయకుడిగా నటించిన ‘చంద్రముఖి’ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.

Published : 07 Mar 2022 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌(Rajinikanth) కథానాయకుడిగా నటించిన ‘చంద్రముఖి’ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందులో జ్యోతిక నటన తమిళ, తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ‘లక లక లక’ అంటూ రాజుగా రజనీ పలికే ఊత పదం అప్పట్లో అందరి నోళ్లలోనూ నానింది. ఇక ‘వారాయ్‌.. నానున్నయ్ తోటి.. వందే నిన్నె ఉక్కుండాడి. మంజమే నానిదే ఎన్నయం కైకుడు తోగయుం తోలిమ వాడ’ అంటూ తమిళంలో సాగే పాట తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్కూళ్లు, కాలేజీల్లో జరిగే కార్యక్రమాలకు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ పాటకే ఎక్కువగా నృత్యం చేసేవారు. కావాలనే దర్శకుడు పి.వాసు తెలుగు సినిమాలో తమిళ పాటను, తమిళ సినిమాలో తెలుగు పాటను పెట్టారు. తెలుగు పాటకు కూడా అక్కడ విశేష స్పందన రావడం విశేషం.

గతంలో ‘శంకరాభరణం’ సినిమాను కూడా మలయాళంలోకి అనువదిస్తే మంచి ఆదరణ పొందింది. అయితే, సినిమాలోని సంభాషణలు మాత్రమే అనువదించారు కానీ, పాటలు మాత్రం అలాగే, తెలుగులోవే ఉంచేశారు. ఆ పాటలు ప్రేక్షకులకి అర్థం కాకపోయినా, వాటికీ మంచి ఆదరణ దక్కింది. ఎప్పుడో వి.శాంతారాం తీసిన ‘అప్నాదేశ్‌’ హిందీ చిత్రంలో టంగుటూరి సూర్యకుమారితో తెలుగు పాటలు పాడించారు. ఊటుకూరి సత్యనారాయణరావు రాశారు. మొదటి తమిళ చిత్రంగా చెప్పుకొనే ‘కాళిదాసు’ (1933)లో కూడా తెలుగు పాటలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని