relangi: ఈ ఇండస్ట్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలి!

వెండితెరపై తనదైన హాస్యాన్ని పంచిన నటుల్లో రేలంగి వెంకట్రామయ్య ఒకరు

Published : 21 Feb 2022 14:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెండితెరపై తనదైన హాస్యాన్ని పంచిన నటుల్లో రేలంగి వెంకట్రామయ్య ఒకరు. పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా జానర్‌ ఏదైనా తన నటనతో ఆ పాత్రకు వన్నె తెచ్చేవారు. అంతేకాదు, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు కూడా. కథానాయకులతో పాటు, డిమాండ్‌ ఉన్న నటుల జాబితాలో రేలంగి కూడా ఉండేవారు. అయితే, తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందని అంటారు. ఓసారి రేలంగి విషయంలోనూ అదే జరిగింది.

హిందీలో వచ్చిన ‘సీతా ఔర్‌ గీతా’ని తెలుగులో ‘గంగ-మంగ’ పేరుతో తీశారు. అందులో ఓ పాత్ర కోసం రేలంగిని అనుకున్నారు. చక్రప్రాణి కాల్షీట్లు పంపారు. పాతికో, ముఫ్ఫైవేలో పారితోషికం ఇస్తానన్నారు. అందుకు రేలంగి మాత్రం ‘‘అలాగే అంటారు. ఆ తర్వాత ఈ డేట్స్‌ చాలవంటారు. ఇంకా పనిచేయాలంటారు. రూ.50వేలు ఇచ్చినా తక్కువే. ఓ పని చెయ్యండి. రోజుకు పదివేలు ఇవ్వమనండి. ఎన్ని రోజులైనా చేస్తా’’ అని అన్నారు. ఎందుకంటే కనీసం 15రోజులైనా పని చేయించుకుంటారని రేలంగి నమ్మకం.

ఇదే విషయాన్ని చక్రపాణికి చెప్పారు ఆయన మేనేజర్‌. ‘అలా కాదు కానీ, రూ.40వేలు ఇస్తామని చెప్పండి’ అంటూ చక్రపాణి మళ్లీ మేనేజర్‌ను రేలంగి వద్దకు పంపారు. ‘ఒప్పుకొనేది లేదు. రోజుకు పదివేలు ఇస్తేనే చేస్తా’ అని ఖరాకండీగా చెప్పేశారు రేలంగి. చక్రపాణి మరీ మొండి. ‘అలాగే’ అని రేలంగి పాత్రను రెండురోజుల్లోనే పూర్తి చేసి, రూ.20వేలు చేతిలో పెట్టారు. ‘‘అమ్మో! నేనే తెలివైన వాడిని అనుకుంటే చక్రపాణి ముందు నేనెంత? ఆయన మేథావి. ఆ 40వేలకు ఒప్పుకొన్నా బాగుండేది. ఇప్పుడు ఇరవైవేలు ఇచ్చారు. ఈ ఇండస్ట్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని రేలంగి ఓ సందర్భంలో పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు