సావిత్రి కోపం: మంచం రెడీగా ఉంది.. వెళ్లిపడుకో...!

అది రామవిజేతావారి చిత్ర షూటింగ్‌. దర్శకుడు బాబూరావు దీపను సావిత్రికి పరిచయం చేశారు.

Published : 25 Apr 2022 12:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అది రామవిజేతావారి చిత్ర షూటింగ్‌. దర్శకుడు బాబూరావు దీపను సావిత్రికి పరిచయం చేశారు. ‘మంచి పాత్రలు చేస్తున్నావా అమ్మాయ్‌’ అని అడిగారు సావిత్రి. దీప వయ్యారంగా కనురెప్పలు ఆర్పుతూ ‘తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలే కాక, హిందీ సినిమాల్లోనూ బుక్‌ అయ్యానండీ’ అంది స్టైల్‌గా. ‘ఒక నటికి భాష కాదు ముఖ్యం. ఏ క్యారెక్టర్లు వస్తున్నాయన్నదే ముఖ్యం. తెలుగు, తమిళ చిత్రాలలో అయితే చీర కొంగును మామూలుగా ఎడమవైపు నుంచి కుడి భుజం మీదుగా ఉంటుంది కదా! అదే హిందీ చిత్రమైతే ఒక్కోసారి కుడివైపు నుంచి ఎడమ భుజం మీదుగా వేసుకోవాల్సి ఉంటుంది. మలయాళ చిత్రమైతే అసలు కొంగే అక్కర్లేదు. అందుకే భాష, కాస్ట్యూమ్స్‌ ముఖ్యం కాదు. టాలెంట్‌ ప్రదర్శించడానికి అనువైన పాత్రలు లభించాలి’ అన్నారు సావిత్రి. ఇంతలో డైరెక్టర్‌ పిలుపునకు ఇద్దరూ షాట్‌లో పాల్గొనడానికి వెళ్లారు.

మర్నాడు షూటింగ్‌లోనూ వీళ్లిద్దరూ ఉన్నారు. సకాలానికి సావిత్రి సెట్‌కు చేరుకున్నారు. దీప అప్పటికింకా రాకపోవడంతో సావిత్రిపై కొన్ని క్లోజప్‌ షాట్స్‌ తీశారు. గంటన్నర తర్వాత సావిత్రి వెళ్లి ఫ్లోర్‌ బయట కూర్చున్నారు. కాసేపటికి దీప తాపీగా కారు దిగింది. సావిత్రికి కోపం ఆగింది కాదు. ‘ఏంటమ్మా ఇండస్ట్రీలో కొత్తగా ప్రవేశించావు. షూటింగ్‌కు ఆలస్యంగా వస్తే ఎలా? నేనూ ఒకప్పుడు నీకులాగానే బిజీ హీరోయిన్‌ని. కానీ, నా కోసం సెట్లో ఎవరూ కాచుకుని ఉండకుండా ఎంతో జాగ్రత్తపడేదాన్ని. డబ్బు సంపాదన ముఖ్యమే. అందుకోసం ఎందరినో ఇబ్బంది పెట్టడం బాగుందా’ అన్నారు. ‘అమ్మా మీరింకా ఆ పాత కాలంలోనే ఉన్నారు. ఆ రోజుల్లో నెలకు ఓ చిత్రం ప్రారంభమయ్యేది. ఇప్పుడు వారానికే ఎన్నో చిత్రాలు ప్రారంభమవుతున్నాయి. మూడు షిఫ్ట్‌ల్లో షూటింగ్‌లు జరుగుతున్నాయి. నిజానికి ఉదయం నుంచి నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. అసలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. మీరు సీనియర్‌ ఆర్టిస్టు గనుకే ఇంతగా సంజాయిషీ ఇవ్వవలసి వస్తోంది’ అంది దీప.

‘ఓహో షూటింగే ఎగొట్టేద్దామనుకున్నావా? ఇంట్లో రెస్టు తీసుకోవాలకున్న నువ్వు ఇక్కడే రెస్టు తీసుకో. జబ్బున పడి మంచమెక్కే సీన్‌ కదా ఇవాళ తీయబోయేది. సెట్‌లో మంచం రెడీగా ఉంది. నీరసంగా పడుకో. నేచురల్‌గా ఎఫెక్ట్‌ బాగా వస్తుంది’ అన్నారు సావిత్రి. దీంతో మరో మాట మాట్లాడకుండా మేకప్‌ గదివైపు నడిచింది దీప.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని