Punjab election Result: ‘చీపురు’ తుపాను.. కొట్టుకుపోయిన దిగ్గజాలు

పంజాబ్‌ రాష్ట్రాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఊడ్చేసింది. అంచనాలకు మించి అఖండ విజయం సాధించింది. ఎంతలా అంటే ఆప్‌ జోరు ముందు ప్రముఖ నేతలు కూడా నిలవలేకపోయారు

Updated : 10 Mar 2022 16:10 IST

సీఎం, మాజీ సీఎంలకు తప్పని ఓటమి

చండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్రాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఊడ్చేసింది. అంచనాలకు మించి అఖండ విజయం సాధించింది. ఎంతలా అంటే ఆప్‌ జోరు ముందు ప్రముఖ నేతలు కూడా నిలవలేకపోయారు. ఏకంగా ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్‌ చన్నీ సహా దాదాపు ప్రముఖ రాజకీయ నేతలందరూ ఓటమిపాలయ్యారు. మాజీ సీఎంలు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ వంటి దిగ్గజ నేతలను కూడా గెలుపు వరించలేదు. 

పంజాబ్‌లో ఓటమి చవిచూసిన ప్రముఖ నేతలు ఎవరెవరంటే.. 

* సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఈ ఎన్నికల్లో చామ్‌కౌర్ సాహిబ్‌, భదౌర్‌ నుంచి పోటీ చేశారు. అయితే పోటి చేసిన రెండు చోట్లా చన్నీకి ఓటమి తప్పలేదు. రెండో చోట్లా ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. భదౌర్‌లో చన్నీ దాదాపు 25వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూడగా.. చామ్‌కౌర్‌ సాహిబ్‌లో కేవలం 4వేల తేడాతో ఓడిపోయారు. 

* పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు తన కంచుకోట పాటియాలా గట్టి షాక్ తగిలింది. తాజా ఎన్నికల్లో ఆయన ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి అజిత్‌ పాల్‌ సింగ్ కోహ్లీ చేతిలో 20వేల తేడాతో ఓటమిపాలయ్యారు.

పంజాబ్ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. సిద్ధూపై ఆమ్‌ ఆద్మీ అభ్యర్థి జీవన్‌ జ్యోత్‌ కౌర్‌ దాదాపు 7వేల ఓట్ల తేడాతో గెలిచారు. 

* శిరోమణి అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ లంబీ నుంచి ఓటమిపాలయ్యారు. ఈయన వయసు 94 ఏళ్లు. ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడు ఈయనే కావడం విశేషం. ఈ నియోజకవర్గానికి ఆయన 1997 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థి జగపాల్‌ సింగ్‌ బాదల్‌ విజయం సాధించారు.

* శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ జలాలాబాద్‌ నుంచి ఓడిపోయారు. 2009 నుంచి 2019 వరకు ఆయన ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో అసెంబ్లీకి రాజీనామా చేసి ఫిరోజ్‌పూర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ బరిలోకి అడుగుపెట్టగా.. అదృష్టం వరించలేదు.

* ఇక, కాంగెస్‌ తరఫున పోటీ చేసిన బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌.. మోగ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఈ స్థానం కాంగ్రెస్‌కు గత 40 ఏళ్లుగా కంచుకోటగా ఉంది. అయినప్పటికీ మాళవిక సూద్‌ను ప్రజలు తిరస్కరించారు.

మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన ఆప్‌..

మరోవైపు పంజాబ్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు ఆ పార్టీ 66 చోట్ల విజయం సాధించగా.. 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్ర భంగపాటు ఎదురైంది. ఆ పార్టీ కనీసం 20 స్థానాలు కూడా దక్కించుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం హస్తం పార్టీ 11 చోట్ల విజయం సాధించగా.. మరో 6 చోట్ల ఆధిక్యంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని