Bommai: 10 రోజుల్లో రెండోసారి.. దిల్లీకి హుటాహుటిన కర్ణాటక సీఎం!

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అకస్మాత్తుగా హస్తినకు పయనమయ్యారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండోసారి .......

Published : 21 May 2022 01:58 IST

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అకస్మాత్తుగా హస్తినకు పయనమయ్యారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండోసారి ఆయన దిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా భాజపాలో చర్చనీయాంశంగా మారింది.  కేబినెట్‌ విస్తరణకు భాజపా అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందేమోనన్న ఆశలు మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల్లో వ్యక్తమవుతుండగా.. రాబోయే రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందంటూ మరికొందరు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఇటీవల త్రిపురలో జరిగిన పరిణామాలతో నాయకత్వ మార్పు ఉంటుందేమోనన్న గుసగుసలూ వినబడుతున్నాయి. అయితే, సీఎం బొమ్మైని మార్చే ప్రసక్తే లేదని భాజపా ముఖ్య నేతలు ఇప్పటికే పలుమార్లు చెప్పడంతో నాయకత్వ మార్పు జరిగే అవకాశంలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మే 10, 11 తేదీల్లో దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం బొమ్మై.. కేంద్రమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కేబినెట్‌ విస్తరణపైనే ఆయన ప్రధానంగా అప్పట్లో చర్చించారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేబినెట్‌ విస్తరణపై భాజపా కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని.. ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా దిల్లీ పర్యటనకు వెళ్లడం కీలకంగా మారింది.

మరోవైపు, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ మంత్రి పదవులు ఆశిస్తున్న వారి నుంచి సీఎంపై ఒత్తిడి ఎక్కువవుతోంది. అయితే, వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనుండటంతో ఇప్పుడు మంత్రిపదవులు వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదంటూ కొందరు ఔత్సాహిక నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. కర్ణాటక కేబినెట్‌లో మొత్తం 34 మంది మందికి అవకాశం ఉండగా.. ప్రస్తుతం 29మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఐదు మంత్రి పదువులు ఖాళీగా ఉన్నాయి. బొమ్మైని మారుస్తారనే ఊహగానాలను భాజపా ముఖ్యనేతలు అరుణ్‌సింగ్‌, మాజీ సీఎం యడియూరప్ప, భాజపా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ వంటి నేతలు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఎన్నికలకు సన్నద్ధతపై దృష్టిపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గతంలో బొమ్మైకి సూచించారని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని