Janasena: ఓడిస్తామన్న వారి సవాల్‌ను స్వీకరిస్తున్నా : పవన్‌ కల్యాణ్‌

దేశంలో ఎక్కడికెళ్లినా ఏపీ ఆర్థిక పరిస్థితిపైనే చర్చ నడుస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ శుక్రవారం...

Updated : 11 Aug 2022 14:27 IST

అమరావతి: దేశంలో ఎక్కడికెళ్లినా ఏపీ ఆర్థిక పరిస్థితిపైనే చర్చ నడుస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్ శుక్రవారం రాత్రి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై స్పందించారు. ‘‘వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇప్పటికే అప్పుపుట్టని స్థితికి తెచ్చారు. దిల్లీ పెద్దల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో మాకు స్పష్టత ఉంది. జనసేన, భాజపా కలిసి జనాల్లోకి వెళ్తాం. ముందస్తు ఎన్నికల అంశం ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉమ్మడి కార్యాచరణ ఉండాలి. నా అభిప్రాయాలను భాజపా పెద్దలకు వివరిస్తాను. రాష్ట్ర ఆర్థికస్థితి, శాంతిభద్రతలు, అస్తవ్యస్త పాలన గురించి చెబుతాను. రాష్ట్ర భాజపాతో కలిసి పనిచేస్తున్నా ప్రణాళికా లోపముంది. అయితే అంతా కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. పొత్తు అంశంపై నేను ఎలాంటి ఆలోచన చేయలేదు. ప్రస్తుతం భాజపాతో మాత్రమే కలిసి నడుస్తాం. ప్రజలకు దగ్గరయ్యే విధంగా యాత్ర చేపడతా’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

‘‘పెట్టుబడుల కోసం విదేశీ సంస్థలు స్థిరత్వం చూస్తాయి. స్థిరత్వం లేనప్పుడు ఎన్ని పర్యటనలు చేసినా ప్రయోజనం ఉండదు. కాగితాల మీద సంతకాలు పెడితే పరిశ్రమ పెట్టినట్లు కాదు. నేను ఎక్కడి నుంచి పోటీచేసినా ఓడిస్తామన్న వారి సవాల్‌ను స్వీకరిస్తున్నా. అయితే ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదు.’’ అని పవన్‌ పేర్కొన్నారు. రూ.లక్ష కోట్లు విదేశాలకు తరలించే తెలివితేటలు ఉన్న వారు జనాలకు మేలు చేసే అంశాలపై శ్రద్ధ పెట్టరా? అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని