Andhra News: వ్యవసాయమంటే రైతు కన్నీరు కార్చేలా దోపిడీ చేస్తున్నారు: సోము వీర్రాజు

ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని అరికట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు సోము బహిరంగ లేఖ రాశారు.

Published : 19 May 2022 17:17 IST

అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని అరికట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు సోము బహిరంగ లేఖ రాశారు. రైతుల కష్టాన్ని మిల్లర్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం సత్వరమే స్పందించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ‘‘ధాన్యానికి మద్దతు ధర లేదు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో మిల్లర్లు, అధికారులు ఒప్పందం చేసుకొని రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనేక వేదికల ద్వారా ప్రయత్నించాను. కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర కారణంగా నా మాటలు పెడచెవిన పెట్టింది. తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాల్లో లక్షలాది ఎకరాల్లో వరి పండించిన రైతులకు రూ.కోట్లు కుచ్చుటోపి పెడుతున్న ధాన్యం మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఈ-క్రాప్ నమోదులో అవినీతి జరుగుతోందని.. ఏకంగా 17వేల మంది రైతుల ఖాతాల చిరునామాలు గల్లంతయ్యాయని రాజ్యసభ సభ్యులు పిల్లిసుభాష్ చంద్రబోస్ స్వయంగా పేర్కొన్నారు. సొంత పార్టీ ఎంపీ మాటలనైనా సీఎం జగన్‌ పరిగణనలోకి తీసుకోవాలి.

75 కిలోల ధాన్యం బస్తాకు రూ.1,455 చెల్లించాలి. అయితే రూ.1200 కంటే తక్కవే చెల్లిస్తున్నారు. మిల్లర్ల వద్దకు మొత్తం ధాన్యం వెళ్లే విధంగా క్షేత్రస్తాయిలో అధికారులు మౌకిక ఆదేశాలు జారీ చేయడం వెనుక కుట్ర జరుగుతోంది. ధాన్యం కొనేది మిల్లర్లు.. గణాంకాలు లెక్కించేది ఆర్‌బీకే సెంటర్లు.. ఈ విధంగా వారంతట వారే బాధ్యతలు పంచుకుని రైతుల సొమ్ము మింగేస్తున్నారు. ఈ దర్జా దోపిడీ వెనుక ఎవరున్నారనే విషయాన్ని దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఈ విషయం తేలాలంటే సీఎం జగన్‌ స్పందించాలి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ధాన్యం తేమ శాతం ఆధారంగా ఒక్కో శాతానికి రూ.50 చొప్పున తగ్గిస్తున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను నాణ్యత పేరుతో దోచేస్తున్నారు. వ్యవసాయం అంటే రైతు కన్నీరు కార్చే విధంగా దోపిడీ జరుగుతోంది. సీఎం జగన్‌ స్పందించి రైతులకు భరోసా ఇచ్చి మద్దతు ధర చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు పక్కాగా అందేలా చర్యలు తీసుకోవాలి’’ అని సోము డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని