Ts News: మోత్కుపల్లితో నా స్నేహం రాజకీయాలకు అతీతం: సీఎం కేసీఆర్‌

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరారు. తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సమక్షంలో మోత్కుపల్లి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పి

Updated : 18 Oct 2021 20:08 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరారు. తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సమక్షంలో మోత్కుపల్లి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మోత్కుపల్లి పరిచయం అక్కర్లేని వ్యక్తి. నాకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరం అనేక ఏళ్లు కలిసి పని చేశాం. గతంలో విద్యుత్‌ కోసం తెలంగాణ అనేక ఇబ్బందులు పడింది. విద్యుత్‌ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉన్న మోత్కుపల్లికి ఆ కష్టాలు తెలుసు. మోత్కుపల్లి వైద్యానికి రూ.కోటి ఖర్చయినా పర్లేదని చెప్పాను. మోత్కుపల్లితో నా స్నేహం రాజకీయాలకు అతీతం’’ అని అన్నారు.

‘‘తెరాసకు రాజకీయం ఒక యజ్ఞం.. మిగతావాళ్లకు ఒక ఆట. స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారం అని ఉద్యమం ప్రారంభించాను. స్వరాష్ట్ర ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నన్ను తిట్టినన్ని తిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదు. స్వరాష్ట్ర మద్దతు కోసం మాయావతిని 13 సార్లు కలిశాను. తెలంగాణలో ఇప్పుడిప్పుడే సమస్యలు కొలిక్కి వస్తున్నాయి. రైతులు, చేనేతల ఆత్మహత్యలు ఆగిపోయాయి. ముందుముందు మరింత చేయాల్సి ఉంది. అట్టడుగు వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి. కొన్ని ప్రాంతాలు తెలంగాణలో విలీనం కోరుతున్నాయి. దళితబంధు భేటీలకు మోత్కుపల్లి హాజరయ్యారు. దళితబంధు పథకానికి రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని యోచన ఉంది. వచ్చే ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటుంది. ఏడేళ్లలో దళితబంధుకు రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేయడం పెద్ద విషయం కాదు. రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడి రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తుంది. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలి. వచ్చే ఎన్నికల్లోనూ తెరాస గెలుస్తుంది. బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి’’ అని కేసీఆర్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని