T20 World Cup: ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలి.. వారిలో అశ్విన్ ఉండాలి: గావస్కర్

టీ20 ప్రపంచకప్‌ 2021లో గెలుపు కోసం ఎదురు చూస్తున్న టీమ్‌ఇండియా ఇవాళ అఫ్గానిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. అఫ్గాన్‌తో పోరు అంటే ఆషామాషీ..

Updated : 03 Nov 2021 12:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2021లో గెలుపు కోసం ఎదురు చూస్తున్న టీమ్‌ఇండియా ఇవాళ అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. అఫ్గాన్‌తో పోరు అంటే ఆషామాషీ వ్యవహారం కాదనేది ఆ జట్టు ప్రదర్శనను చూస్తే అర్థమైపోతుంది. అఫ్గాన్‌ స్పిన్‌ త్రయంతో జాగ్రత్తగా ఉండాలని మాజీలు కోహ్లీ సేనను హెచ్చరిస్తున్నారు. అలానే ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌, షాహజాద్‌ కూడా ప్రమాదకరమేనని పేర్కొన్నారు. మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో (4 పాయింట్లు) పట్టికలో రెండో స్థానంలో ఉంది ఆ జట్టు. స్కాట్లాండ్‌, నమీబియాపై భారీ విజయాలను నమోదు చేయగా.. పాకిస్థాన్‌ను కూడా ఓడించేంత పని చేసింది. నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ స్పిన్‌ను ఎదుర్కొని పరుగులు రాబడితే సగం విజయం సాధించినట్లే.

ఈ క్రమంలో టీమ్‌ఇండియా కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సునీల్‌ గావస్కర్ సూచించాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను బరిలోకి దించాలని పేర్కొన్నాడు. అశ్విన్‌ ప్రపంచశ్రేణి బౌలర్‌ అని, అందుకే అఫ్గాన్‌తో మ్యాచ్‌లోనైనా తుది జట్టులోకి తీసుకోవాలని స్పష్టం చేశాడు. హార్దిక్‌ పాండ్య రెండు ఓవర్లు వేసినా.. బుమ్రా, శార్దూల్‌/షమీ పేస్‌ బౌలింగ్‌ సరిపోతుందని తెలిపాడు. గత రెండు మ్యాచుల్లో స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, రవీంద్ర జడేజాతో బౌలింగ్‌ చేయించినా.. వీరిద్దరూ పెద్దగా ప్రభావం చూపలేదు. మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన వరుణ్‌ చక్రవర్తి ఆకట్టుకోలేకపోయాడు. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే మాత్రం వరుణ్ చక్రవర్తి స్థానంలో అశ్విన్‌ను తీసుకోవాలని గావస్కర్‌ సూచించాడు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల బౌలింగ్‌ దాడితో దిగితేనే ఉత్తమ ఫలితాలను సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అశ్విన్‌, జడేజా, వరుణ్‌ చక్రవర్తి/రాహుల్‌ చాహర్‌ను ఎంచుకోవచ్చని పేర్కొన్నాడు. సమష్టిగా రాణిస్తోన్న అఫ్గాన్‌ జట్టు ఎంతో ప్రమాదకరంగా ఉందని, తక్కువ అంచనా వేసి ఆడితే మాత్రం పరాభవం తప్పదని హెచ్చరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని