Rahul Tripathi: రాహుల్‌కు అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ ఆడే సత్తా ఉంది: హేడెన్

హైదరాబాద్‌ యువ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠీకి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడే సత్తా ఉందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 18 May 2022 11:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌ యువ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠీకి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడే సత్తా ఉందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ అభిప్రాయపడ్డాడు. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ (76; 44 బంతుల్లో 9x4, 3x6) ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అతడు రెచ్చిపోయి ఆడాడు. చివరికి హైదరాబాద్‌ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం అతడి బ్యాటింగ్‌పై స్పందించిన మాజీ క్రికెటర్‌ ప్రశంసలు కురిపించాడు.

‘రాహుల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేసే విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. స్టేడియం నలుమూలలా షాట్లు ఆడుతూ ప్రమాదకారి బ్యాట్స్‌మన్‌గా కనిపిస్తున్నాడు. త్వరలోనే అతడు టీమ్‌ఇండియాకు ఆడాలనుకుంటున్నా. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగానే బరిలోకి దిగి పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకున్నాడు. విలియమ్సన్‌ తన స్థానాన్ని కిందకు మార్చుకొని మంచి నిర్ణయం తీసుకున్నాడు. దీంతో రాహుల్‌ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతడి ఆట నన్ను మంత్రముగ్ధుడిని చేసింది. అన్నింటికన్నా ముఖ్యమైనది షార్ట్‌పిచ్‌ బంతులను కూడా ఆడగల నేర్పరితనం. అతడిని ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్‌లపై ఆడిస్తే కచ్చితంగా క్లిక్‌ అవుతాడు’ అని ఆసీస్‌ మాజీ వివరించాడు. కాగా, మ్యాచ్‌ అనంతరం హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సైతం రాహుల్‌ను మెచ్చుకున్నాడు. అతడో ప్రత్యేకమైన ఆటగాడని అన్నాడు. ఎప్పుడు బరిలోకి దిగినా మ్యాచ్‌ గమనాన్ని మార్చేస్తాడని కితాబిచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని