Ravi Shastri : రాహుల్‌కు టీమ్‌ఇండియా నుంచి పిలుపు ఎంతో దూరంలో లేదు: రవిశాస్త్రి

ముంబయిపై అద్భుతంగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ బ్యాటర్‌ రాహుల్ త్రిపాఠిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే 13 మ్యాచులకుగాను...

Published : 19 May 2022 02:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ ఏడాది టీ 20లీగ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్‌ బ్యాటర్‌ రాహుల్ త్రిపాఠిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత్‌ జట్టులోకి రాహుల్ త్రిపాఠి తప్పకుండా వస్తాడని సీనియర్‌ క్రికెటర్లు, మాజీలు చెబుతున్నారు. తాజాగా టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవి శాస్త్రి అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్భయంగా ఆడేస్తున్న త్రిపాఠికి టీమ్ఇండియా జట్టులోకి పిలుపు ఎంతో దూరంలో లేదని రవి శాస్త్రి పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా క్యాప్‌ను పొందడానికి రాహుల్‌ ఎంత దూరంలో ఉన్నాడని అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి పై విధంగా సమాధానమిచ్చాడు. 

‘‘భారత్‌ జట్టులో ఎవరైనా గాయపడి జట్టు నుంచి తప్పుకుంటే వెంటనే రాహుల్‌తో భర్తీ చేయవచ్చు. మూడు లేదా నాలుగో స్థానంలో అతను బ్యాటింగ్‌ చేయగలడు. మిడిలార్డర్‌లో డేంజరస్‌ బ్యాటర్‌గా మారతాడు. వరుస టీ20 లీగ్‌ సీజన్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. సెలెక్టర్లు అతడిని చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్నారని అనుకుంటున్నా. తప్పకుండా అవకాశం ఇస్తారని భావిస్తున్నా’’ అని రవి శాస్త్రి అన్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌కు బ్యాకప్‌గా నిలుస్తాడా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘‘ఎవరి బ్యాటింగ్‌ శైలి వారిది. బౌలర్‌ ఎవరు? ప్రత్యర్థి ఎవరు? అనే విషయాల గురించి ఇద్దరూ పెద్దగా ఆలోచించరు. వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తారు’’ అని రవిశాస్త్రి వివరించాడు. 

రాహుల్‌ ఈ సీజన్‌లో 13 మ్యాచులకుగాను 161.73 స్ట్రైక్‌రేట్‌తో 393 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలున్నాయి. ఎలాంటి సమయంలోనైనా ఒత్తిడి లేకుండా ధాటిగా షాట్లు కొట్టగలడం అతని ప్రత్యేకత. గత సీజన్‌లోనూ కోల్‌కతా తరఫున 17 మ్యాచుల్లో 397 పరుగులు సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని