Rohit Sharma: డేవిడ్‌ రనౌట్‌ అయ్యే వరకు గేమ్‌లో ఉన్నామనుకున్నా: రోహిత్‌

టిమ్‌డేవిడ్‌ క్రీజులో ఉన్నంతవరకు తాము మ్యాచ్‌లో ఉన్నామని అనుకున్నానని ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.  గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ల...

Updated : 18 May 2022 09:59 IST

ముంబయి: టిమ్‌డేవిడ్‌ క్రీజులో ఉన్నంతవరకు తాము మ్యాచ్‌లో ఉన్నామని అనుకున్నానని ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.  గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 194 పరుగుల భారీ ఛేదనలో ముంబయి కేవలం 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. చివరిబంతి వరకూ పోరాడిన రోహిత్‌సేన విజయపుటంచుల దాకా వెళ్లి బోల్తాపడింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ టిమ్‌డేవిడ్‌ రనౌట్‌ దురదృష్టకరమని అభిప్రాయపడ్డాడు.

‘18వ ఓవర్‌ దాకా మ్యాచ్‌ మాదే అనుకున్నాం. కానీ, డేవిడ్‌ రనౌట్‌ దురదృష్టకరం. అప్పటి వరకు మేం గెలుస్తామనే నమ్మకంతో ఉన్నా. హైదరాబాద్‌ జట్టుకు అభినందనలు. వాళ్లకు పూర్తి క్రెడిట్‌ దక్కుతుంది. చివరివరకూ ఊపిరిబిగబట్టి ఆడారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా మా జట్టులో కొంతమంది యువకులతో ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయించాలనుకున్నాం. అందుకే ప్రయోగాలు చేశాం. అయితే, హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ బాగా ఆడారు. దీంతో మా బౌలింగ్‌ తడబడింది. బ్యాట్‌తో రాణించి చివరివరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లినా గెలుపొందలేకపోయాం. ఇకపై ఆడాల్సిన చివరి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి విజయంతో ముగించాలనుకుంటున్నాం. వీలైతే కొంతమంది యువకులకు ఆడే అవకాశం కల్పిస్తాం’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ప్రియమ్‌గార్గ్‌ (42), రాహుల్ త్రిపాఠి (76), నికోలస్‌ పూరన్‌ (38) దంచికొట్టారు. అనంతరం ముంబయి ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (48), ఇషాన్‌ కిషన్‌ (43), టిమ్‌ డేవిడ్‌ (46) రాణించారు. అయితే, 17 ఓవర్లకు ముంబయి 149/5తో నిలిచి ఓటమిపాలయ్యేలా కనిపించినా 18వ ఓవర్‌లో డేవిడ్‌ దంచికొట్టాడు. నటరాజన్‌ వేసిన ఆ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు సంధించడంతో పాటు రెండు వైడ్లు రావడంతో ముంబయి మొత్తం 26 పరుగులు రాబట్టింది. కానీ, అదే ఓవర్‌ చివరి బంతికి డేవిడ్‌ అనవసర పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. తర్వాత హైదరాబాద్‌ పుంజుకొని ముంబయిని 190/7కి పరిమితం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని