T20 League : అమెరికాలో తొలి ప్రొఫెషనల్‌ టీ20 లీగ్‌.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పెట్టుబడి

అమెరికా వ్యాప్తంగా క్రికెట్‌కూ ఆదరణ పెంచేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో తొలిసారి జరగబోయే ఫ్రొఫెషనల్‌ టీ20 లీగ్‌ అయిన ...

Published : 21 May 2022 01:55 IST

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా వ్యాప్తంగా క్రికెట్‌కూ ఆదరణ పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో తొలిసారి జరగబోయే ఫ్రొఫెషనల్‌ టీ20 లీగ్‌ అయిన మేజర్‌ లీగ్‌ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో పెట్టుబడి పెట్టేందుకు ప్రవాస భారతీయ దిగ్గజాలు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌ కూడా నిధులు అందించారు. సిరీస్‌ A, A1 నిధుల సేకరణ పూర్తైనట్లు అమెరికా వ్యాపారవేత్తల బృందం ప్రకటించింది.  మేజర్‌ లీగ్‌ కోసం 120 మిలియన్‌ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే  తొలి రెండు సిరీస్‌ల కోసం 44 మిలియన్‌ డాలర్లను సేకరించినట్లు వెల్లడించింది. మిగతా మొత్తం (76 మిలియన్‌ డాలర్లు) వచ్చే ఏడాదిలోపు ఫండ్‌రైజింగ్‌ ద్వారా సేకరిస్తామన్నారు. 

సిరీస్‌ A, సిరీస్‌ A1 రౌండ్‌ ఫండ్‌ రైజింగ్‌కు సత్య నాదెళ్ల  నాయకత్వం వహించారు. ‘‘అమెరికాలో క్రికెట్‌ వ్యాప్తి కోసం, సదుపాయాల కల్పన కోసం ఫండ్‌ రైజింగ్‌ చేపట్టాం. దీని కోసం అత్యుత్తమ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్వెస్టర్స్‌ కమిటీ పని చేసింది. ప్రపంచస్థాయి ప్రొఫెషనల్‌ క్రికెట్‌ను అతిపెద్ద స్పోర్ట్స్ మార్కెట్‌కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.  ఇన్వెస్టర్‌ గ్రూప్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలను నడిపించే వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. వారి మార్గదర్శకత్వంలో అమెరికాలో తొలి టీ20 లీగ్‌ను విజయవంతం చేస్తాం. అలానే అంతర్జాతీయ క్రికెట్‌ ఈవెంట్లను ఇక్కడ నిర్వహించేలా ప్రయత్నిస్తాం’’ అని మేజర్‌ లీగ్‌ సహ వ్యవస్థాపకులు సమీర్ మెహతా, విజయ్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. 

ఫండ్‌ రైజ్‌ ద్వారా వచ్చే 120  మిలియన్ డాలర్లను క్రికెట్ మైదానాలు, ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి భవిష్యత్తులో అమెరికా నుంచి స్టార్‌ క్రికెటర్లు వచ్చేలా చూస్తామని సహ వ్యవస్థాపకులు వెల్లడించారు. వచ్చే ఏడాది టీ20 లీగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ సభ్య దేశమైన అమెరికా తమ దేశంలో టీ20 క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (mlc)ని పార్టనర్‌గా ఎంపిక చేసుకుంది. యూఎస్‌ఏ పురుషుల, మహిళల జట్లకు ఎంఎల్‌సీ మద్దతుగా నిలవనుంది. 2024లో విండీస్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ పోటీలకు అమెరికా కూడా కో-హోస్ట్‌గా ఉండనుంది. ఈ క్రమంలో వచ్చే రెండేళ్లలో తమ అమెరికాలో టీ20 క్రికెట్‌ వృద్ధి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సత్య నాదెళ్ల, శంతను నాయణ్‌ కాకుండా మాడ్రోనా వెంచర్‌ గ్రూప్‌ ఎండీ సోమ సోమసేగర్, మిల్లివేస్ వెంచర్స్ అండ్ రాకెట్‌షిప్‌ వైస్‌ ప్రెసిడెంట్ ఆనంద్ రాజారమణ్‌, వెంకీ హరినారాయణ్‌, ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్‌ ఛైర్మన్‌ జైతర్‌ సంజయ్‌ గోవిల్, మేనేజింగ్ పార్టన్ పెరోట్ జైన్‌ తదితరులు ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు ఫండ్‌ అందించారు. ఏ ఇన్వెస్టర్‌ ఎంత ఇచ్చారనేది తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని