YouTube: యూట్యూబ్‌ క్రియేటర్లకు గూగుల్‌ షాక్‌.. త్వరలో ‘గో’ యాప్‌ షట్‌ డౌన్‌!

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. లో-ఎండ్‌ మొబైల్‌ యూజర్ల కోసం గతంలో తీసుకొచ్చిన ‘యూట్యూబ్‌ గో’ యాప్‌ను..

Published : 06 May 2022 19:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. లో-ఎండ్‌ మొబైల్‌ యూజర్ల కోసం గతంలో తీసుకొచ్చిన ‘యూట్యూబ్‌ గో’ యాప్‌ను త్వరలో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్‌ తన అధికారిక బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించింది. యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి ప్రధాన యాప్‌ యూట్యూబ్‌లోనే పలు మార్పులు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా యూట్యూబ్‌ గో యాప్‌నకు యూజర్లు ప్రాధాన్యత ఇవ్వకపోవడమూ ఒక కారణమని తెలుస్తోంది.


‘యూట్యూబ్‌ గో’ను 2016లో గూగుల్‌ ప్రారంభించింది. లిమిటెడ్‌ టెక్నాలజీతో తయారైన లో-ఎండ్‌ మొబైల్‌ ఫోన్ల కోసం దీన్ని తీసుకొచ్చింది. అయితే, చాలాకాలంగా యూజర్లు దీనిపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. దీంతో చాలా రోజుల నుంచి ఈ యాప్‌ నిరుపయోగంగా మారిపోయింది. మరోవైపు ప్రధాన యూట్యూబ్‌కు యూజర్లు మారడంతో ఈ యాప్‌ సర్వీసును నిలిపివేయాలని గూగుల్‌ భావిస్తోంది. వచ్చే ఆగస్టు నెలలో దీన్ని పూర్తిగా మూసివేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

గూగుల్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో లో-ఎండ్‌ మొబైల్స్‌లో యూట్యూబ్‌ వీడియోలు చేస్తున్న క్రియేటర్లకు చాలా కష్టతరమయ్యే అవకాశం ఉంది. అయితే, గూగుల్‌ మాత్రం యూట్యూబ్‌ గో క్రియేటర్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొంది. క్రియేటర్లు ప్రధాన యూట్యూబ్‌ యాప్‌ ద్వారా అన్ని సేవలు పొందవచ్చని తెలిపింది. లో-ఎండ్‌ మొబైల్‌ యూజర్లకు తగ్గట్టుగా యాప్‌లో మార్పులు చేయబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఇప్పటివరకు యూట్యూబ్‌ గోలో అందుబాటులో లేని ఫీచర్లను తీసుకువస్తున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లతో కామెంట్ చేయడం, పోస్ట్ చేయడం, కంటెంట్ క్రియేట్‌ చేసే సదుపాయాన్ని కల్పిస్తామని వివరించింది. అదేవిధంగా డార్క్‌ థీమ్‌ను అందించనున్నట్లు గూగుల్‌ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని