Twitter Circle: ట్విటర్‌లో ట్రోలర్ల బెడదా?.. ‘సర్కిల్‌’తో సులువుగా తప్పించుకోవచ్చు!

యూజర్లు తమ ట్వీట్లను పరిమిత వ్యక్తులతో మాత్రమే పంచుకోవడానికి ‘ట్విటర్‌ సర్కిల్‌’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

Updated : 11 May 2022 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా సీఈఓ, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసిన తర్వాత కొత్త ఫీచర్లపై దృష్టి సారించింది. తాజాగా ట్విటర్‌లో యూజర్లు తమ ట్వీట్లను పరిమిత వ్యక్తులతో మాత్రమే పంచుకోవడానికి ‘ట్విటర్‌ సర్కిల్‌’ (Twitter Circle) అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఫీచర్‌ మాదిరిగానే పనిచేయనుంది. మనం చేసిన ట్వీట్లను కొంతమందికి మాత్రమే కనిపించేలా ముందుగా ఒక గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 150 మంది వరకు చేర్చుకోవచ్చు.

‘‘ప్రస్తుతం ‘ట్విటర్‌ సర్కిల్‌’ ప్రయోగాత్మక దశలో ఉంది. ఈ ఫీచర్‌ సాయంతో మీకు నచ్చిన వారిని 150 మంది వరకు ఎంచుకొని ఒక గ్రూప్‌గా క్రియేట్‌ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న వారికి మాత్రమే ఆ ట్వీట్‌ కనిపించేలా ఇది పనిచేస్తుంది’’ అని ట్విటర్‌ సేఫ్టీ ట్వీట్‌లో పేర్కొంది.


ఎలా పనిచేస్తుంది?

📍 ట్విటర్‌లో మీరు ఫాల్‌ అవుతున్నారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా యూజర్లు ముందుగా 150 మందిని ఎంచుకోవాలి.

📍 ట్వీట్‌ను మీరు ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే కనిపించడానికి 'ట్విటర్ సర్కిల్' అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. దీంతో మనం చేసిన ట్వీట్లు ప్రపంచానికంతా చేరవు.

📍 ట్విటర్‌లో ఇక గేలిచేసే వారి బెడద ఉండదు. ఈ ఫీచర్‌ ద్వారా ట్రోలర్ల పోరు నుంచి చాలావరకు తప్పించుకోవచ్చు.

📍 ఏ సమయంలోనైనా 150 మందితో కూడిన లిస్ట్‌ను ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎవరినైనా, ఎప్పుడైనా తొలగించుకోవచ్చు. యాడ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు రిమూవ్‌ చేసిన సంగతిని ఎదుటివారు గుర్తించలేరు.

ఇదిలా ఉండగా..  గత నెల రోజులుగా ట్విటర్‌లో చాలా మార్పులు తీసుకురావాలని మస్క్‌ పదే పదే సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయన మరో కీలక ప్రకటన చేశారు. ‘‘ట్విటర్ అందరికీ ఉచితం కాదు. ట్విటర్‌ ఖాతా కలిగిన వాణిజ్య, ప్రభుత్వ సంస్థలు ఇక నుంచి స్వల్ప మొత్తంలో రుసుము చెల్లించాల్సి రావొచ్చు’’ అని మస్క్ ట్వీట్ చేశారు. అయితే సాధారణ వినియోగదారులకు మాత్రం ట్విటర్ సేవలు ఎల్లప్పుడూ ఉచితమేనని ప్రకటించారు. ట్విటర్ సంస్థతో కొనుగోలు ఒప్పందం కుదిరినప్పటి నుంచీ మస్క్ అందులో మార్పులు, చేర్పులు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ విధంగా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని