Twitter: సింగిల్‌ ట్వీట్‌లో మరిన్ని ఫొటోలు, వీడియోలు యాడ్‌ చేసుకోవచ్చు!

యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించడానికి ట్విటర్‌ కొత్త ఫీచర్లను తీసుకువచ్చే పనిలో పడింది. తాజాగా ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated : 09 May 2022 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించడానికి ట్విటర్‌ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు తన పనితీరును మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లపై దృష్టి సారించింది. తాజాగా ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఫీచర్లు ఏంటో? ఎలా పనిచేస్తాయో చూద్దాం..!

యూజర్లు ఇప్పటివరకు నాలుగు ఫొటోలు లేదా ఓ వీడియోను మాత్రమే ట్వీట్‌లో యాడ్ చేసుకునే సదుపాయం ఉండేది. ట్విటర్‌ తీసుకువచ్చే కొత్త ఫీచర్‌ సాయంతో ఆ సంఖ్య పెరగనుంది. ట్వీట్‌లో ఒకేసారి అదనంగా ఫొటోలు, వీడియోలు యాడ్‌ చేసుకునే విధంగా ఈ ఫీచర్‌ పనిచేయనుంది. అయితే, ఎన్ని ఫొటోస్‌, వీడియోలు ట్వీట్‌లో యాడ్‌ చేసుకోవచ్చనే దానిపై స్పష్టత రాలేదు. ఈ ఫీచర్‌పై ట్విటర్‌ ఇంకా పనిచేస్తుందని.. త్వరలో యూజర్లకు అందుబాటులోకి తెస్తుందని ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది.

ఇదే కాకుండా స్టేటస్, అవార్డ్స్‌, ప్రోనౌన్స్‌ పేజీ పేరిట మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకురావాలని ట్విటర్‌ యోచిస్తోంది. ఆంగ్ల వెబ్‌సైట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్టేటసెస్‌, అవార్డ్స్‌, ప్రొ నౌన్స్‌ పేజీ ఫీచర్లు యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. స్టేటసెస్‌ ఫీచర్‌ యూజర్‌ చేసిన ట్వీట్‌ను స్టేటస్‌గా పెట్టుకునేలా పనిచేస్తుంది. యూజర్‌ ప్రొఫైల్‌ మీద ఇది డిస్‌ప్లే అవుతుంది. అలాగే ఎవరి ట్వీట్‌కైనా ఎన్ని మార్కులు ఇస్తారో తెలిపేందుకు అవార్డ్స్‌ ఫీచర్‌ పనిచేయనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ బటన్‌ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఆ ట్వీట్‌ ఎన్ని అవార్డ్స్‌ గెలుచుకుందో డిస్‌ప్లే మీద చూపించనుంది. ప్రొ నౌన్స్‌ పేజీ ఎలా పనిచేస్తుందనే దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు.

ట్విటర్‌లో యూజర్లు తమ ట్వీట్లను పరిమిత వ్యక్తులతో పంచుకోవడానికి వీలుగా ‘ట్విటర్‌ సర్కిల్‌’ అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఫీచర్‌ మాదిరిగానే పనిచేయనుంది. మనం చేసిన ట్వీట్లను కొంతమందికి మాత్రమే కనిపించేలా ముందుగా ఒక గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 150 మంది వరకు చేర్చుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని